ఇక ‘కిరాణా’పై అంబానీ కన్ను!

15 Nov, 2017 23:17 IST|Sakshi

దుకాణాలు, తయారీదార్లతో జియో లింకు

కస్టమర్లందరికీ వారితో అనుసంధానం

జియో యూజర్లకు డిస్కౌంట్‌ కూపన్లు

భారీ మార్కెట్‌ వాటా దిశగా ప్రణాళికలు

3 నగరాల్లో ప్రయోగాత్మకంగా మొదలు

వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తం..!

న్యూఢిల్లీ: జియోతో దేశ టెలికం రంగాన్ని కుదిపేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తదుపరి అడుగు ఎటువైపు? కిరాణా మార్కెట్లోనూ విప్లవం సృష్టించే దిశగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్టు మార్కెట్‌ పరిశీలకులు చెబుతున్నారు. తీవ్ర పోటీతో కూడిన టెలికం మార్కెట్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన అంబానీ... దిగ్గజాలను కంగుతినిపించి మార్కెట్‌ ముఖచిత్రాన్నే మార్చేశారు. అలాగే, రిలయన్స్‌ జియో కస్టమర్ల బేస్‌తో, గ్రోసరీ మార్కెట్లోనూ సంచలనం సృష్టించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

ఒకవైపు విదేశీ కంపెనీలు భారత్‌ రిటైల్‌ మార్కెట్‌పై కన్నేయగా... మరోవైపు ఆన్‌లైన్‌ వేదికగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు వేల కోట్ల రూపాయలతో పోటీ పడుతున్నాయి. వీటికి భిన్నంగా ముకేశ్‌  అంబానీ ప్రతి వీధిలో ఉండే చిన్న కిరాణా దుకాణాలను ఆధారం చేసుకుని వ్యూహ రచన చేస్తున్నారు. తయారీ దారులు, కిరాణా దుకాణాలను జియో కస్టమర్లతో అనుసంధానం చేయాలన్నది అంబానీ వ్యూహం. తద్వారా భారీ మార్కెట్‌ అవకాశాలను సొంతం చేసుకోవచ్చన్నది యోచన.

జియో కస్టమర్లకు డిస్కౌంట్స్‌
రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు కిరాణా దుకాణాల్లో తగ్గింపు ధరలకే కొనుగోలు చేసుకునేలా డిజిటల్‌ కూపన్లను ఆఫర్‌ చేస్తోంది. ఇందుకోసం జియో తన సొంత నిధులను ఖర్చు పెట్టదు. కేవలం తయారీదారులు, కిరాణా దుకాణాలకు, తన చందాదార్లను పరిచయం చేసి... తద్వారా తన చందాదారులకు ప్రయోజనం కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఇక్కడ తయారీదారులకు వారి బ్రాండ్ల ప్రమోషన్‌ జరుగుతుంది. కిరాణా దుకాణాలకు మరింత మంది కస్టమర్లు చేరువవుతారు. ఈ తగ్గింపు ఆఫర్లతో జియో సైతం ప్రస్తుత తన కస్టమర్లను కాపాడుకోవడంతో పాటు కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతుంది. ఇప్పటికే ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టు మొదలైంది. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నారు.

ఈ కామర్స్‌ కంపెనీల వ్యూహాలతో చిన్న కిరాణా దుకాణాల వ్యాపారం తగ్గగా... అంబానీ మాత్రం వీటినే భారీ అవకాశంగా భావిస్తున్నారు. టెలికంలో సాధ్యమవగా లేనిది  కిరాణాలో ఎందుకు అసాధ్యం? అన్నది అంబానీ ఆలోచన. 650 బిలియన్‌ డాలర్ల దేశ రిటైల్‌ పరిశ్రమలో ఈ కామర్స్‌ కంపెనీల వాటా కేవలం 3–4 శాతంగానే ఉంది. వ్యవస్థీకృత రిటైలర్ల(పెద్ద మాల్స్‌) వాటా 8% ఉండగా, 88% వాటా చిన్న కిరాణా దుకాణాల చేతుల్లోనే ఇప్పటికీ ఉండటం గమనార్హం. ఇంత భారీ మార్కెట్‌ అవకాశాలను అంబానీ జియో సాయంతో ఎలా కొల్లగొడతారో చూడాల్సి ఉందని మార్కెట్‌ పరిశీలకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు