భౌగోళిక ఉద్రిక్తతలతో... మార్కెట్‌ డైలమా

17 Apr, 2017 03:06 IST|Sakshi
భౌగోళిక ఉద్రిక్తతలతో... మార్కెట్‌ డైలమా

కీలకంగా క్యూ4 ఫలితాలు
విశ్లేషకుల అభిప్రాయం


న్యూఢిల్లీ: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల పోకడ ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నదని విశ్లేషకులంటున్నారు. దీంతో పాటు ఈ వారంలో వెలువడే వివిధ కంపెనీల గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌  గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. తదితర అంశాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు.  

ఉత్తర కొరియా.. ఆందోళనకరం
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఉత్తర కొరియా పరిస్థితుల పట్ల అందోళనకరంగా ఉన్నారని ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా చెప్పారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఎలాంటి కీలక ఘటన జరిగినా, అది అంతర్జాతీయంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుందని, ప్రపంచమార్కెట్లతో పాటే భారత మార్కెట్‌ కూడా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం స్టాక్‌  మార్కెట్‌.. కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిందని, ఈ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటం కానీ, అంచనాలను మించడం కానీ జరిగితేనే మార్కెట్‌ జోరు కొనసాగుతుందని వివరించారు.

నేడు (సోమవారం) వెలువడే టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ముఖ్యమైనవేనని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డైరెక్టర్‌ అభ్నిశ్‌ కుమార్‌ సుధాంశు పేర్కొన్నారు. భవిష్యత్‌ మార్కెట్‌ గమనాన్ని కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు నిర్దేశిస్తాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఆర్థిక ఫలితాలు వెల్లడించేటప్పుడు ఆయా కంపెనీల యాజమాన్యాలు పేర్కొనే భవిష్యత్‌ అంచనాలు కీలకమని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపేన్‌ షా పేర్కొన్నారు.

టీసీఎస్‌ ఫలితాలు ఈ వారమే
ఈ వారంలో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీతో పాటు పలు లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను వెల్ల డించనున్నాయి. ఈ మంగళవారం(ఈ నెల 18న) టీసీఎస్,  బుధవారం(19న )యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, గురువారం (ఈ నెల 20న) హిందుస్తాన్‌ జింక్, మైండ్‌ ట్రీ, క్రిసిల్, శుక్రవారం(ఈ నెల 21న)హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,   ఏసీసీలు క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి.  కాగా గత వారంలో సెన్సెక్స్‌ 245 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే నేడు (సోమవారం) చైనా క్యూ1 జీడీపీ, ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడుతాయి. మంగళవారం(ఈ నెల 18) అమెరికా మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. ఇక శుక్రవారం(ఈ నెల 21) నాడు యూరోజోన్, అమెరికా తయారీ, సేవల రంగాల పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు, జపాన్‌ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు వెలువడుతాయి.

జోరుగా విదేశీ పెట్టుబడులు
భారత క్యాపిటల్‌ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.16,529 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత తయారీ రంగం గత నెలలో పెరగడంతో  సెంటిమెంట్‌ మెరుగుపడి ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం., ఎఫ్‌పీఐలు ఈ నెల 3–13 కాలానికి మన స్టాక్‌ మార్కెట్లో  రూ.2,997 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.13,531 కోట్లు చొప్పున  వెరశి మన క్యాపిటల్‌ మార్కెట్లో  రూ.16,529 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

 దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.85,156 కోట్ల(1,300 కోట్ల డాలర్లు)కు చేరాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరింత వేగంగా సంస్కరణలు వస్తాయనే అంచనాలతో గత నెలలో ఎఫ్‌పీఐలు రూ.56,944 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది  ఫిబ్రవరిలో మన ఈక్విటీ, డెట్‌ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు రూ.15,862 కోట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు