మార్కెట్ల ర్యాలీ మన ఘనత కాదు!

6 Aug, 2017 23:55 IST|Sakshi
మార్కెట్ల ర్యాలీ మన ఘనత కాదు!

‘సాక్షి’తో జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ స్ట్రాటజిస్ట్‌ విజయ్‌కుమార్‌  
ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ నడుస్తోంది!!
25 ఎమర్జింగ్‌ మార్కెట్లలో 23 మన కంటే ముందే
మనకన్నా అర్జెంటీనా, చైనా 30%, దక్షిణ కొరియా 21% వృద్ధి
మరో 8 నెలలు ఐటీ, ఫార్మా షేర్లు కుదేలే; బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీలకు డోకాలేదు
ఏడాది తర్వాతే ఆర్థిక సంవత్సరంలో మార్పు; తొలుత కాస్త ఇబ్బందులు


‘‘సరిగ్గా నెల కిందట 30 వేల పాయింట్లకు అటూ ఇటుగా ఉన్న దేశీ మార్కెట్ల బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌... నెల రోజుల్లో 32 వేలు దాటేసింది. అయితే ఈ స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. నిజం చెప్పాలంటే ఇది మన ఘనతేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లన్నీ ఇదే స్థితిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన దేశంతో పోలిస్తే అర్జెంటీనా, చైనా దేశాల మార్కెట్లు 30 శాతం, దక్షిణ కొరియా 21 శాతం వృద్ధిలో ఉన్నాయి.

 ఇండియా, చైనా, అమెరికా, అర్జెంటీనా, రష్యా వంటి ప్రపంచంలోని 25 ఎమర్జింగ్‌ మార్కెట్లలో 23 దేశాలు సానుకూల వాతావరణంలోనే ఉన్నాయి. రష్యా, కెనడా మాత్రం ప్రతికూల వాతావరణంలో కొనసాగుతున్నాయి’’ అని జియోజిత్‌  ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ డాక్టర్‌ వి.కె.విజయ్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ అంశాలపై ఆయనింకా ఏమన్నారంటే..

సానుకూల సమయమిది
2007–08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2010–11లో యూరప్‌ సంక్షోభం, 2013లో అమెరికాలో రుణ సంక్షోభం, 2016లో బ్రెగ్జిట్‌.. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్‌ మార్కెట్లు పలు సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రతికూలం నుంచి సానుకూలం వైపు అడుగులేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోంది. గతేడాది మన దేశ ఆర్థి్థక వ్యవస్థ వృద్ధి రేటు 7.2 శాతం. ఈ ఏడాది 7.7 శాతానికి చేరుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నివేదిక చెబుతోంది. ఇదే వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది 3.1 శాతంగా ఉంది. ఈ ఏడాది 3.4 శాతానికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

స్టాక్‌ మార్కెట్లోకి నిధుల వెల్లువ..
గతేడాదితో పోలిస్తే స్టాక్‌ మార్కెట్లోకి నిధుల ప్రవాహం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను వంటి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణమని చెప్పాలి. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో భౌతికంగా డబ్బు దొరకడమే గగనమైంది. పోనీ, బ్యాంకుల్లో వేద్దామన్నా, తీద్దామన్నా సవాలక్ష ఆంక్షలు, ఇక జీఎస్‌టీతో అసంఘటిత రంగం కాస్త సంఘటితంగా మారుతుంది.

చాలా మంది పన్ను పరిధిలోకి వచ్చేస్తారు. దీంతో ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు పెరుగుతాయి. ఫలితంగా జీడీపీ వృద్ధి చెందే అవకాశముంది. ఈ రెండింటితో భౌతిక పొదుపు కంటే ఆర్థిక పొదుపు వైపు జనాలు మళ్లుతున్నారు. అంటే బంగారం, రియల్‌ ఎస్టేట్‌ వంటి వాటి కంటే స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమే మేలనే నిర్ణయానికొస్తున్నారు. పోనీ, బ్యాంకుల్లో దాచుకుందామంటే.. వడ్డీ రేట్లూ తక్కువే కదా!!.

æ దేశీయ మార్కెట్లో ఏడెనిమిదేళ్ల పాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫార్మా రంగాల హవా కొనసాగింది. కానీ, గత కొంతకాలంగా ఈ విభాగాలు ప్రతికూల వాతావరణంలో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ 2,300 కంటే తక్కువకు వచ్చేసింది. గతేడాది 2,000లుగా ఉన్న లుపిన్‌.. ఇప్పుడు వెయ్యి కంటే తక్కువే. వ్యాల్యుయేషన్స్‌ తక్కువగా ఉంటున్నాయి. కాకపోతే వీటి వృద్ధి రేటు కూడా పడిపోతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పలు నిర్ణయాలు, ధరల తగ్గింపు వంటివి ఇందుకు కారణం. అయితే ఇలాంటి సమయంలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే... కొంత రిస్కు తీసుకోవటం లాంటిదే.

రిటైల్‌ మీద ఫోకస్‌ చేసే బ్యాంకులు, ఎన్‌పీఏ తక్కువగా ఉన్న బ్యాంకుల షేర్లు రానున్న రోజుల్లో మరింత బాగుంటాయి. ఈ రంగంలో విలీనాలు కూడా ఇన్వెస్టర్లకు కలిసొస్తాయి. వాహన, గృహం వంటి రుణాలను అందిం చే ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ కూడా బాగుంటాయి. సిమెంట్, మెటల్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ బాగానే ట్రేడ్‌ అవుతున్నాయి. మరో 8 నెలలపాటు వీటికి ఎలాంటి ఇబ్బందులుండకపోవచ్చు. కొనుగోళ్లు, విలీన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేముందు సంబంధిత కంపెనీల షేరు ధర, స్వాప్‌ రేషియో, వ్యాల్యుయేషన్స్‌ను గమనించాలి. వీటి మీదే ఆయా షేర్ల వృద్ధి ఆధారపడి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎంఎఫ్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. చిన్న షేర్ల విషయానికొస్తే వాటి వ్యాల్యుయేషన్స్‌ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్వెస్ట్‌ చేసే ముందు అవన్నీ గమనించాలి.

నెలకు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఐపీ) పథకాల్లో రూ.4,800 కోట్లు చేరుతున్నాయి. యాక్టివ్‌ ఎస్‌ఐపీ ఖాతాలు 4.45 కోట్ల వరకూ ఉంటాయి. గతేడాదితో పోలిస్తే మ్యూచువల్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) తాలూకు నిధులు పెద్ద మొత్తంలో స్టాక్‌ మార్కెట్లోకి వస్తున్నాయి. జూలైలో రూ.12,727 కోట్లు స్టాక్స్‌లో చేరాయి. స్టాక్‌ మార్కెట్లోని మొత్తం అసెట్స్‌లో ఒక్క ఎంఎఫ్‌ పరిశ్రమ వాటానే రూ.19.97 లక్షల కోట్లుంటుంది. ఏటా 31.5 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది కూడా.

ఆర్ధిక సంవత్సరం మార్పుతో తొలి దశలో కాసింత గందరగోళం ఏర్పడినా.. తర్వాత తర్వాత సానుకూలమవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్థిక సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31, ఇది క్యాలెండర్‌ ఇయర్‌. కానీ, మన దేశంలో మాత్రమే ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31. ప్రపంచ బ్యాంక్‌ కూడా క్యాలెండర్‌ ఇయర్‌నే ఫాలో అవుతుంది. దీంతో కొన్ని సమయాల్లో మన దేశానికి ఇబ్బందులొస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపించేందుకు కేంద్రం ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్‌ ఇయర్‌కు మార్చే నిర్ణయాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. తొలి దశలో ఖాతాల అప్‌లోడింగ్‌ వంటి వాటిల్లో ఇబ్బందులు రావచ్చు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పాలి. పెట్టుబడుల ఆకర్షణలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. పలు విధానపరమైన నిర్ణయాలతో విదేశీ కంపెనీలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. అయితే జీఎస్‌టీ కారణంగా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కాసింత విఘాతం ఏర్పడటం మాత్రం ఖాయం. దాన్ని పూరించేందుకే పన్ను రాబడులను కోల్పోయే రాష్ట్రాలకు కేంద్రం నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అందుకే ప్రస్తుతం జీఎస్‌టీ పన్ను శ్లాబుల్లో కొన్నింటికి జీఎస్‌టీతో పాటూ సెస్సును జత చేశారు. ఈ సెస్సును ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు పరిహారంగా అందిస్తారు.

మరిన్ని వార్తలు