అవుట్‌ పేషెంట్‌ కవరేజీ తీసుకుంటే మేలా...? 

6 Aug, 2018 00:06 IST|Sakshi

సాధారణ వైద్య పాలసీకి  ప్రీమియం తక్కువ 

ఓపీడీ కవరేజీ తీసుకుంటే  అధిక ప్రీమియం  

డాక్టర్‌ కన్సల్టేషన్‌ల పరంగానూ పరిమితులు 

దీనికంటే విడిగా ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం నయం

ఆరోగ్యపరంగా ధీమాగా ఉండాలంటే నేడు వైద్య బీమా ఉండాల్సిందే.  ఆస్పత్రి పాలైతే చికిత్స వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మరి ఆస్పత్రిలో చేరే అవసరం లేకుండా అవుట్‌ పేషెంట్‌గా తీసుకునే చికిత్సల వ్యయాల సంగతేంటి? ఎప్పుడైన ఆలోచించారా...? ఆస్పత్రిలో వైద్యుల కన్సల్టేషన్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల కొనుగోలు వ్యయాలు వీటికి ఎవరికి వారు విడిగా చెల్లించుకోవాలా..? లేక బీమా పాలసీలో కవరేజీ కావాలా? వైద్య బీమా పాలసీలో ఇది కూడా ముఖ్యమైన అంశమే.  చాలా కంపెనీలు రెగ్యులర్‌ హెల్త్‌ పాలసీలతోపాటు అవుట్‌ పేషెంట్‌ విభాగం (ఓపీడీ) నుంచి పొందే చికిత్సలకు కూడా కవరేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, ఓపీడీ కవరేజీని ఎంచుకునే ముందు వేటికి కవరేజీ లభిస్తుంది? ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్‌కు అనుమతిస్తారు? తదితర అంశాలను తప్పక తెలుసుకోవాలి. వీటికి ప్రీమియం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. 

ఓపీడీ కవరేజీని విడిగా పాలసీ రూపంలో కంపెనీలు ఆఫర్‌ చేయడం లేదు. సాధారణ హెల్త్‌ పాలసీకి అనుబంధంగానే ఓపీడీ కవరేజీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్, అపోలో మ్యునిక్, ఐసీఐసీఐ లాంబార్డ్, మ్యాక్స్‌ బూపా ఈ కవరేజీతో పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణంగా ఓపీడీ కవరేజీలో డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజు, వైద్యులు రాసిన మందులకు అయ్యే వ్యయాలు, వైద్య పరీక్షల వ్యయాలకు కవరేజీ ఉంటుంది. వీటికి క్లెయిమ్‌ను ఆస్పత్రి ద్వారా క్యాష్‌లెస్‌ రూపంలో పొందొచ్చు. లేదా రీయింబర్స్‌మెంట్‌ విధానంలోనూ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం బీమాలో ఓపీడీ కవరేజీ ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్‌ చేసుకోవచ్చన్నది ముఖ్యంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఓపీడీ కవరేజీ చాలా పరిమితంగానే ఉండొచ్చు. వైద్య బీమా రూ.10 లక్షల కవరేజీకి తీసుకుంటే అందులో ఓపీడీ కవరేజీ గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.10,000కే పరిమితం అవుతుంది. దీనికి మించి ఎంత ఖర్చు చేసినా కంపెనీ ఇవ్వదు. ఇక కొన్ని కన్సల్టేషన్‌లకు, మందుల కొనుగోలుకు మళ్లీ పరిమితులను కంపెనీలు విధిస్తుంటాయి. ఉదాహరణకు మ్యాక్స్‌ బూపా డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజుకు గరిష్టంగా రూ.600వరకే ఇస్తోంది. రూ.10 లక్షల పాలసీలో ఒక ఏడాదికి ఇలా గరిష్టంగా 10 డాక్టర్‌ కన్సల్టేషన్‌లకు అయిన వ్యయాలను చెల్లిస్తోంది. ఇతర ఓపీడీ ప్రయోజనాలు కూడా ఈ పాలసీలో ఉన్నాయి. అదే రూ.4 లక్షలకు పాలసీ తీసుకుంటే కన్సల్టేషన్‌లు నాలుగింటికే పరిమితం. డయాగ్నోస్టిక్‌ టెస్ట్‌లకు పరిమితి రూ.1,500.  

ప్రీమియం 
చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లడం సర్వ సాధారణం. అయితే, బీమా కంపెనీలు మాత్రం ఓపీడీ కవరేజీకి అధిక ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ఓపీడీ కవరేజీ అన్నది వసూలు చేసే ప్రీమియానికి కాస్తంత ఎక్కువగా ఉండటాన్ని చాలా కంపెనీల్లో గమనించొచ్చు. స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఓపీడీ ప్రయోజనాలతో కూడిన రూ.4 లక్షల వైద్య బీమా పాలసీని 35 ఏళ్ల వయసున్న వ్యక్తి, అతని జీవిత భాగస్వామి, ఒక చిన్నారి (మొత్తం ముగ్గురు)కి కలిపి వార్షికంగా రూ.15,000 ప్రీమియంను వసూలు చేస్తోంది. ఇందులో ఓపీడీ క్లెయిమ్‌ బెనిఫిట్‌ పరిమితి ఏడాదికి ముగ్గురికీ కలిపి రూ.3,280 మాత్రమే. ఇదే కుటుంబం రూ.5 లక్షల హెల్త్‌ పాలసీని ఓపీడీ లేకుండా తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.11,915. అంటే రూ.3,280 ఓపీడీ కవరేజీ కోసం కంపెనీ రూ.3,085ను ప్రీమియంగా వసూలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్‌లోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంది. రూ.10 లక్షల వైద్య బీమా పాలసీని ఓపీడీ కవరేజీతో తీసుకుంటే ప్రీమియం రూ.4,000–7,000 వరకు అదనంగా (ఓపీడీ లేని పాలసీ ప్రీమియంతో పోలిస్తే) ఉంది.  

ప్రత్యామ్నాయాలూ ఆలోచించాలి..!
ఓపీడీ కవరేజీ తీసుకుంటే అదనంగా చెల్లించే ప్రీమియానికి సెక్షన్‌ 80డీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఓపీడీ కవరేజీ కింద కంపెనీల నుంచి పొందే రీయింబర్స్‌మెంట్‌కు పన్ను లేదు. అయితే, పన్ను ఆదా ఒక్కటే ఓపీడీ కవరేజీ తీసుకోవడానికి కారణం కారాదు. ఉదాహరణకు మధుమేహ సమస్యతో ఉన్న వారు, హైబీపీతో బాధపడుతున్న వారు తరచూ వైద్యుల వద్దకు వెళ్లాల్సి రావడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరపడుతుంది. మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ తరహా వ్యక్తులకు బీమా కంపెనీల నుంచి తగినంత కవరేజీ లభించకపోవచ్చు. ఒకవేళ లభించినా ప్రీమియం అధికంగా ఉంటుంది. అందుకని ఓపీడీ కవరేజీ తీసుకోవడం కంటే అందుకు అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు విడిగా ఆదా చేసుకోవడం మంచిది. ఇందుకోసం వేతనంలో కొంత మేర పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. లేదంటే షార్ట్‌టర్మ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా రికరింగ్‌ డిపాజిట్లలో అయినా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ నిధి అవుట్‌ పేషెంట్‌ చికిత్సల రూపంలో ఎదురయ్యే అకస్మిక ఖర్చులను తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు