ముందు ఇల్లు  తర్వాతే పెళ్లి

28 Sep, 2019 02:01 IST|Sakshi

35 ఏళ్ల లోపే సొంతింటి యజమాని 

సాక్షి, హైదరాబాద్‌: 90వ శతాబ్ధం వరకు జీవిత వరుసక్రమం.. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆ తర్వాతే ఇల్లు! కానీ, 20వ శతాబ్ధం నుంచి సీన్‌ రివర్స్‌ అయింది. ఉద్యోగం వచ్చిందంటే చాలు సొంతింటి ఎంపికే ప్రధాన లక్ష్యంగా మారింది. యువత జనాభా పెరుగుతుండటం, చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగ అవకాశాలు రావటం, తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంక్‌ రుణాలు లభ్యమవుతుండటం, ప్రభుత్వం నుంచి రాయితీలు, పన్ను మినహాయింపులుండటం వంటి కారణాలతో ముందు ఇల్లు.. ఆ తర్వాతే పెళ్లి ఆలోచన అంటోంది నేటి యువతరం. 

1990 వరకూ పొదుపు చేసిన సొమ్మే: 1990 సంవత్సరం వరకూ సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనో లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. దీంతో ఆ సమయంలో ఎక్కువ శాతం గృహ కొనుగోలుదారులు 45–55 ఏళ్ల వయసుగల వాళ్లే ఉండేవాళ్లు. పైగా ఆ సమయంలో బ్యాంక్‌లు, ఇతర రుణ సంస్థలు కూడా ప్రాపర్టీ విలువలో 85–90 శాతం వరకు రుణాలు ఇచ్చేవి కావు. దీంతో పొదుపు చేసిన సొమ్మే సొంతింటికి దిక్కయ్యేది. 

2000 నుంచి సీన్‌ మారింది: డెవలపర్లకు, ప్రకటనదారులకు గృహ కొనుగోలుదారుల వయసు అనేది అత్యంత ప్రధానమైంది. 2000 సంవత్సరం నుంచి గృహ కొనుగోళ్లలో చాలా మార్పులు వచ్చాయి. కస్టమర్ల అభిరుచుల్లోనే కాకుండా వారి కొనుగోలు శక్తి వయసులోనూ మార్పులు వచ్చాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ రీసెర్చ్‌ హెడ్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపా రు. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. 

35–45 ఏళ్ల లోపే టార్గెట్‌: అనరాక్‌ నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో 37 శాతం గృహ కొనుగోలుదారులు 35–45 ఏళ్ల వయసు వాళ్లున్నారు. 25 శాతం కస్టమర్లు 45–55 ఏళ్లు, 20 శాతం కస్టమర్లు 25–35 ఏళ్లు వయసున్నారు. ఇక, 25 ఏళ్ల లోపు కంటే తక్కువ ఉన్న కొనుగోలుదారులు 7 శాతం వరకున్నారు. హైదరాబాద్‌లో 38 శాతం ప్రాపర్టీ కొనుగోలుదారులు 25–35 సంవత్సరాల వయసున్న వాళ్లున్నారు.

>
మరిన్ని వార్తలు