రెరా పరిధిలో ఉంటే నో మార్టిగేజ్‌ 

11 Jan, 2019 23:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మార్టిగేజ్‌ వ్యవస్థకు కాలం చెల్లనుంది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్‌లకు మార్టిగేజ్‌ మినహాయింపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 200 చ.మీ. కంటే ఎక్కువ స్థలంలోని ప్రాజెక్ట్‌లకు 10 శాతం బిల్టప్‌ ఏరియాను మార్టిగేజ్‌ (తనఖా) చేయాలనే నిబంధన అమలులో ఉంది. ఈ స్థలాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) వచ్చిన తర్వాతే రిలీజ్‌ చేస్తారు. అయితే రెరా ప్రకారం.. కొనుగోలుదారులు అపార్ట్‌మెంట్‌ ధరలో 10 శాతం సొమ్మును ఓసీ వచ్చిన తర్వాతే డెవలపర్‌కు చెల్లించాలనే నిబంధన ఉంది. అలాంటప్పుడు ముందుగా జీహెచ్‌ఎంసీకి 10 శాతం స్థలాన్ని మార్టిగేజ్‌ చేయడమనేది సరైంది కాదని డెవలపర్ల సంఘాలు వాదిస్తున్నాయి.

ప్రభుత్వం స్థలాన్ని, కొనుగోలుదారులు సొమ్మును మొత్తంగా 20 శాతం నిలిచిపోతే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసే డెవలపర్‌కు భారంగా మారుతుందని.. అందుకే రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్‌లకు మార్టిగేజ్‌ నిబంధనను తొలగించాలని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌), తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌), తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) ప్రతినిధులు బుధవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కమీషనర్‌ దాన కిశోర్, సిటీ చీఫ్‌ ప్లానర్‌ దేవేందర్‌ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సంఘాల ప్రతినిధుల డిమాండ్లు ఏంటంటే.. 

అపార్ట్‌మెంట్ల ఎత్తు 21 మీటర్లు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎకరం లోపు స్థలంలో నిర్మించే అపార్ట్‌మెంట్లకు తప్పనిసరి సెల్లార్‌ నిబంధనను తొలగించాలి. 33 శాతం స్థలం పార్కింగ్‌ నిబంధన కారణంగా సెల్లార్, స్టిల్ట్‌ రెండూ తీయాల్సి వస్తుంది. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం.. 18 మీటర్ల లోపు ఉండే నివాస సముదాయాలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) అవసరం లేదు. దీన్ని 21 మీటర్లకు పెంచాల్సిన అవసరముంది. దీంతో జీ+5 భవనాలకు సెల్లార్‌ అవసరం లేకుండా రెండు స్టిల్ట్స్‌ నిర్మించే వీలుంటుంది. దీంతో సెల్లార్‌ తవ్వకం, వ్యర్థాలను పారేయడం వంటి అదనపు ఖర్చులు తగ్గుతాయి. పైగా అపార్ట్‌మెంట్ల ఎత్తును గణించడంతో జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. మున్సిపల్‌ విభాగం ప్రకారం అపార్ట్‌మెంట్‌ ఎత్తు పార్కింగ్‌ నుంచి మొదలైతే.. అగ్నిమాపక శాఖ మాత్రం గ్రౌండ్‌ లెవల్‌ నుంచి లెక్కిస్తుంది. 

వెంటిలేషన్‌ 10 శాతం చాలు.. 
ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రసరణ (వెంటిలేషన్‌) సరిగా ఉండేందుకు గది బిల్టప్‌ ఏరియాలో 7.5 మీటర్లకు ఒక్క కిటికీ ఉండాలనే నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) చెబుతోంది. అయితే ఈ రోజుల్లో భవన నిర్మాణాలే గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు వెంటిలేషన్స్‌ను కూడా ఎన్‌బీసీ నిబంధనలు వర్తింపజేయడం సరైంది కాదు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రకారం.. గోడల ఏరియాలో 10 శాతం కిటికీలు ఉంటే సరిపోయేలా నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరముంది.

డీపీఎంఎస్‌అప్‌గ్రేడ్‌ వర్షన్‌
అపార్ట్‌మెంట్లకు సెట్‌బ్యాక్స్, ఎత్తు వంటి నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆన్‌లైన్‌ డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌) వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. 21 రోజుల్లోనే అనుమతులు కూడా వచ్చేస్తున్నాయి. అదే.. మల్టీ స్టోర్, గేటెడ్‌ కమ్యూనిటీ వంటి ప్రత్యేక ప్రాజెక్ట్‌ల విషయంలో మాత్రం ఆన్‌లైన్‌ డీపీఎంఎస్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు సుమారు 4 నెలల సమయం పడుతుంది. అందుకే ప్రత్యేక ప్రాజెక్ట్‌లకూ డీపీఎంఎస్‌ వినియోగంలో ఇబ్బందుల్లేకుండా సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు