దేశీ వినియోగానికి రెమ్‌డెసివిర్‌ ఔషధం!

30 May, 2020 10:46 IST|Sakshi

గిలియడ్‌ సైన్సెస్‌ దరఖాస్తు

అత్యవసర వినియోగ ప్రాతిపదిక

కోవిడ్‌-19 చికిత్సకు యూఎస్‌ ఓకే

రెమ్‌డెసివిర్‌ తయారీలో దేశీ కంపెనీలు

అమెరికాలో కోవిడ్‌-19 చికిత్సకు వినియోగిస్తున్న ఔషధం రెమ్‌డెసివిర్‌ను దేశీయంగా విక్రయించేందుకు అనుమతించమంటూ విదేశీ దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ తాజాగా దరఖాస్తు చేసుకుంది. ఈ ఔషధంపై క్లినికల్‌ పరీక్షలు పూర్తికాకపోయినప్పటికీ అత్యవసర ప్రాతిపదికన(ఈయూఏ) యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతించింది. ఈ బాటలో దేశీయంగానూ రెమ్‌డెసివిర్‌ ఔషధ మార్కెటింగ్‌కు అనుమతించమంటూ కేంద్ర ప్రామాణిక ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో)కు తాజాగా గిలియడ్‌ సైన్సెస్‌ దరఖాస్తు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై నిపుణుల కమిటీ సూచనలమేరకు సీడీఎస్‌సీవో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఔషధంపై ప్రీక్లినికల్‌, క్లినికల్‌ పరీక్షల డేటాను గిలియడ్‌ సైన్సెస్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 7న జపనీస్‌ ఆరోగ్య శాఖ సైతం అత్యవసర ప్రాతిపదికన కోవిడ్‌-19 బారినపడిన వారి చికిత్సకు వినియోగించేందుకు అనుమతించినట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి.

దేశీ కంపెనీలు
యాంటీవైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌కు పేటెంట్‌ కలిగిన గిలియడ్‌ సైన్సెస్‌ ఇటీవల దేశీ ఫార్మా రంగ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, హెటెరో ల్యాబ్స్‌తో నాన్‌ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాలను చేసుకుంది. ఫలితంగా సిప్లా, హెటెరో ల్యాబ్స్‌ ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని దేశీయంగా తయారు చేసి విక్రయించేందుకు అనుమతించమంటూ దేశీ ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేశాయి. కోవిడ్‌-19 రోగులకు వెంటనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా అత్యవసర ప్రాతిపదికన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వవలసి ఉన్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతో క్లినికల్‌ పరీక్షలు పూర్తికాకుండానే ఈ ఔషధాన్ని వినియోగించేందుకు అనుమతించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి చికిత్సకు రెమ్‌డెసివిర్‌ను వినియోగించడం ద్వారా ప్రయోజనం కలుగుతున్నట్లు న్యూఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పేర్కొంది. అయితే దేశీయంగా క్లినికల్‌ పరీక్షలు ముగించుకున్నాక మాత్రమే ఔషధాలకు అనుమతి లభిస్తుందని విశ్లేషకులు తెలియజేశారు. పలు దేశాలు ఇదే విధానాన్ని అవలంబిస్తాయని, ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఎదురుకావడంతో యూఎస్‌ఎఫ్‌డీఏ తాత్కాలిక ప్రాతిపదికన కొంతమేర సడలింపులను ఇచ్చినట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు