హాలీవుడ్‌ పాటకు రీమేక్‌లో కరోనా పాట!

16 Mar, 2020 12:06 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తున్న పేరు కరోనా వైరస్‌(కోవిడ్‌-19). మొదట చైనాలో పుట్టిన ఈ వైరస్‌ మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తూ.. ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ దేశాల ప్రజలకు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు ఇస్తోంది. ఇక ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం కరోనా నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలంటూ..  జాగ్రత్తలు చెబుతున్నారు.

ఇక కరోనాపై  ఎవరికి తోచినట్లుగా వారు అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో రష్మీ సర్వీ అనే యువతి తాజాగా తన పాట ద్వారా అవగహన కల్పిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 2018లో హాలీవుడ్‌ సింగర్‌ కామిలా కాబెల్లో పాడిన పాట ‘హవానా’కు ‘కరోనా’ వెర్షన్‌తో పాడిన ఈ పాటను సోమవారం ఆమె ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోకు ‘ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ పరిశుభ్రంగా ఉండండి. మీకు ఎమైనా కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి’ అంటూ రష్మీ ట్వీట్‌ చేసింది. కాగా ‘‘ కరోనా.. హో.. నా.. నా. నా ఆలోచన మొత్తం నీ మీదే ఉంది కరోనా.. హో నానా. చైనా నుంచి వచ్చిన ఓ కరోనా..  నీలో ఏదో ఉంది కరోనా.. నా.. నా’’ అంటూ సాగే ఈ పాటతో రష్మీ  ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇక రష్మీ పాడిన కరోనా రీమేక్‌ పాట ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.  ఇప్పటి వరకూ ఆ పాటకు 13వేల వ్యూస్‌ వచ్చాయి. ‘తన వాయిస్‌ చాలా బాగుతుంది’. ‘అందమైన గొంతు నుంచి అద్భుతమైన సాహిత్యం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక  ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీ మహింద్రా గ్రూప్‌ సంస్థల యాజమాని ఆనంద్‌ మహింద్రా కూడా ఆమె పాటకు ఫిదా అయ్యారు. ఈ వీడియోను ఆయన తన ట్విటర్‌లో పంచుకుంటూ.. రష్మీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘రష్మీ పాట వినోదభరితంగా ఉంది. తన గొంతు చాలా బాగుతుంది. మీరు ఓ పెద్ద స్టార్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ కామెంట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు