బ్యాంకులకు పూర్తి స్వయం ప్రతిపత్తి!

12 Apr, 2019 11:40 IST|Sakshi

సామర్థ్యం మెరుగుదలకు బీబీబీ సూచన

న్యూఢిల్లీ: మెరుగైన సామర్థ్యం, వ్యవస్థీకృత పటిష్టత వంటి అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి అవసరమని బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) సూచించింది. బీపీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్‌ టైమ్‌ డైరెక్టర్ల నియామక అత్యున్నత సంస్థ– బీబీబీ,  మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది.

బ్యాంకింగ్‌ రుణ వ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. రుణ వ్యయాలు మరింత తగ్గాలని, రుణ ఆమోదం, కేటాయింపులు, పంపిణీల విషయంలో బ్యాంకింగ్‌ సామర్థ్యం మెరుగుపడాలని సూచించింది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ స్కీమ్‌ ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు ఉండాలని పేర్కొంది.

మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలంలో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకింగ్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్ల నియామకాలు జరిగాయని నివేదిక పేర్కొంటూ, సకాలంలో బీబీబీ ఇచ్చిన సిఫారసులు దీనికి కారణమని తెలిపింది. ప్రభుత్వ రంగ  బ్యాంకుల హోల్‌టైమ్‌ డైరెక్టర్లు అలాగే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నియామకాలకు తగిన సిఫారసులు చేయడానికి నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులతో బీబీబీ ఏర్పాటుకు 2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డ్‌ డైరెక్టర్‌లతో చర్చించి, విలీనాలు సహా బ్యాంకింగ్‌ రంగ పురోగతికి తగిన వ్యూహ రూపకల్పనలోనూ బీబీబీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

మరిన్ని వార్తలు