గ్లెన్‌మార్క్‌ ఫార్మా కొత్త రికార్డ్‌

22 Jun, 2020 10:46 IST|Sakshi

ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103

34 ట్యాబ్లెట్ల స్ట్రిప్‌ రూ. 3500

14 రోజులపాటు చికిత్స

30 శాతం దూసుకెళ్లిన షేరు

కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల యాంటీవైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ను దేశీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 30 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికం కావడంతో రూ. 123 ఎగసి రూ. 532 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! గత రెండు వారాల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.9 లక్షల షేర్లుకాగా.. తొలి గంటలోనే 11.46 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం!

200 ఎంజీ డోసేజీలో
ఫబిఫ్లూ బ్రాండుతో ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా వెల్లడించింది. ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. 200 ఎంజీ డోసేజీలో లభించే ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103కాగా.. కరోనా బారినపడి స్వల్ప సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వీటిని వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలియజేసింది. తొలి రోజు 1800 ఎంజీ డోసేజీ రెండుసార్లు వేసుకోవలసి ఉంటుందని వివరించింది. తదుపరి 14వ రోజువరకూ రోజుకి 800 ఎంజీ చొప్పున రెండు పూటలా తీసుకోవలసి ఉంటుందని తెలియజేసింది. మొత్తం 34  ట్యాబ్లెట్లతో కూడిన స్ట్రిప్‌ ధర రూ. 3500కు లభించనున్నట్లు వెల్లడించింది.

డీజీసీఐ ఓకే
మూడో దశ క్లినికల్‌ పరీక్షల డేటా ఆధారంగా ఫావిపిరవిర్‌ ఔషధాన్ని విక్రయించేందుకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ డీజీసీఏ నుంచి అత్యవసర ప్రాతిపదికన అనుమతి లభించినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది. తద్వారా కోవిడ్‌-19 సోకినవారి చికిత్సకు వీటిని వినయోగించేందుకు వీలు చిక్కినట్లు  ఫార్మా వర్గాలు తెలియజేశాయి. ఈ ఔషధానికి క్లినికల్‌ పరీక్షలలో 88 శాతంవరకూ సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది. నాలుగు రోజుల్లోనే వైరస్‌ లోడ్‌ను గణనీయంగా తగ్గించగలిగినట్లు వెల్లడించింది. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు వినియోగిస్తున్న విషయం విదితమే.
 

మరిన్ని వార్తలు