మూడవ దశలో కీలక క్లినికల్ ట్రయిల్స్: గ్లెన్‌మార్క్

26 May, 2020 15:07 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై:  కరోనా వైరస్  నిరోధానికి ఔషధ తయారీలో దేశీయ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మా మరో అడుగు ముందుకేసింది. ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మా స్యూటికల్స్ కరోనా వైరస్ సోకిన రోగులపై ఇప్పటికే మూడు దశల ట్రయల్స్ ను నిర్వహించింది. తాజాగా యాంటీవైరల్ ఫావిపిరావిర్, ఉమిఫెనోవిర్ మందులపై మూడవ దశలో కీలకమైన మరో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి పొందింది. భారతదేశంలో కోవిడ్-19 రోగులలో ఈ రెండు యాంటీవైరల్ మందుల కలయికలో 'ఫెయిత్ ట్రయల్' గా పిలిచే  ట్రయిల్స్ కోసం  డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుండి అనుమతి లభించిందని గ్లెన్‌మార్క్ తాజాగా ప్రకటించింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!)

ఫావిపిరవిర్, ఉమిఫెనోవిర్ యాంటీవైరల్  డ్రగ్స్ రెండూ వేర్వేరు చర్యలను కలిగి ఉంటాయి. వాటి కలయికతో వ్యాధి ప్రారంభ దశలో రోగులలో అధిక వైరల్ లోడ్లను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని, తద్వారా మెరుగైన చికిత్స సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత ప్రభావవంతమైన,  సురక్షితమైన చికిత్సలను గుర్తించడంలో ఈ అధ్యయనం కీలకమైందిగా  భావిస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్  డాక్టర్ మోనికా టాండన్ వ్యాఖ్యానించారు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు)

ఈ అధ్యయనంలో కరోనావైరస్ మోడరేట్ లక్షణాలు ఉన్న 158 మంది పాల్గొంటారని తెలిపింది. వీరిని రెండు గ్రూపులుగా విడదీసి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రముఖ ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో  ఈ ట్రయల్స్ నిర్వహించనున్నామనీ,  ఇప్పటివరకు, 30 మంది రోగులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు వుంటుందనీ,  మొత్తం అధ్యయనం వ్యవధి గరిష్టంగా  28 రోజులు ఉంటుందని కంపెనీ తెలిపింది.  క్లినికల్ ట్రయల్స్  ఫలితాలు జూలై, లేదా ఆగస్టులో వెలువడే అవకాశం వుందని అంచనా వేసింది.  (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్)

కరోనా రోగులకు చికిత్సను ప్రారంభించాలన్న తమ ప్రయత్నంలో ఇది మరొక దశ అనీ,  ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉత్పత్తి ప్రాప్యతను నిర్ధారించడానికి తాము చేయగిలిందంతా చేస్తామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇండియా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా  బిజినెస్ అధ్యక్షుడు సుజేష్ వాసుదేవన్ అన్నారు. కరోనా సోకిన రోగులపై మూడవ దశలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన మొట్టమొదటి  ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ కావడం విశేషం. 

మరిన్ని వార్తలు