8.8లక్షల కోట్ల డాలర్లు!

16 May, 2020 03:49 IST|Sakshi

ప్రపంచ ఎకానమీకి కరోనా దెబ్బ 

ఏడీబీ నివేదిక

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్‌ డాలర్ల దాకా ప్రతికూల ప్రభావం పడనుంది. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్‌ ప్రారంభంలో వెలువరించిన అంచనాలకు కొనసాగింపుగా ఏడీబీ తాజా నివేదికను రూపొందించింది.

ఏప్రిల్‌ 3న నాటి ఆసియా అభివృద్ధి అంచనాల (ఏడీవో) నివేదికలో ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌పరమైన నష్టాలు సుమారు 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని పేర్కొంది. తాజాగా.. ‘కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ ఎకానమీ సుమారు 5.8 – 8.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో నష్టపోనుంది. ఇది గ్లోబల్‌ జీడీపీలో 6.4–9.7 శాతానికి సమానం. అటు దక్షిణాసియా జీడీపీ కూడా 3.9–6.0 శాతం మేర క్షీణించవచ్చు.

భారత్‌ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం ఇందుకు కారణం‘ అని వివరించింది. ఈ అధ్యయనంలో విధానపరమైన చర్యల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీబీ తెలిపింది. గ్లోబల్‌ జీడీపీ 2–4 శాతం తగ్గొచ్చంటూ ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాల కన్నా ఏడీబీ అంచనాలు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్షీణత 6.3 శాతం స్థాయిలో ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది.

చైనాకు 1.6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు ..
ఆంక్షలను స్వల్పకాలికంగా మూడు నెలల పాటు కొనసాగించిన పక్షంలో  ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ నష్టాలు 1.7 లక్షల కోట్ల డాలర్ల మేర, ఆరు నెలల పాటు అమలు చేస్తే 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనూ ఉంటాయని ఏడీబీ పేర్కొంది. మొత్తం గ్లోబల్‌ ఉత్పత్తి క్షీణతలో ఈ ప్రాంత వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. చైనా నష్టాలు సుమారు 1.1–1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఏడీబీ అంచనా. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్‌ కట్టడిపై వేగంగా స్పందించాయని, ద్రవ్యపరమైన చర్యలతో ఆదాయ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేశాయని ఏడీబీ తెలిపింది. ఈ చర్యలను ఇలాగే కొనసాగించిన పక్షంలో కరోనాపరమైన ప్రతికూల ప్రభావాలు 30–40 శాతం దాకా తగ్గొచ్చని వివరించింది.  

జీతాల్లో కోతలు..
కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్, బ్రిటన్‌లలో వేతన ఆదాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదాయాలు 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల దాకా తగ్గొచ్చని పేర్కొంది. ఆసియాలో వేతన ఆదాయాలు 359–550 బిలియన్‌ డాలర్ల స్థాయిలో క్షీణించవచ్చని వివరించింది.  
ఏడీబీ నివేదిక

మరిన్ని వార్తలు