ప్రపంచ డిమాండ్‌ తగ్గినా... భారత్‌లో బంగారం మెరుపు!

5 May, 2017 00:34 IST|Sakshi
ప్రపంచ డిమాండ్‌ తగ్గినా... భారత్‌లో బంగారం మెరుపు!

జనవరి–మార్చిలో కనకం కాంతి
డబ్ల్యూజీసీ నివేదిక  

ముంబై: బంగారానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2017 జనవరి–మార్చి) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గినా... భారత్‌లో మాత్రం డిమాండ్‌ బాగుంది.  ప్రపంచ పసిడి వేదిక (డబ్ల్యూజీసీ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్ల డించాయి.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే...
2017 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ ప్రపంచవ్యాప్తంగా 18 శాతం తగ్గి 1,034 టన్నులకు పడిపోయింది. 2016 ఇదే త్రైమాసికంలో డిమాండ్‌ 1,262 టన్నులు.

పసిడి ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లోకి తక్కువ నిధులు రావడం, సెంట్రల్‌ బ్యాంకుల డిమాండ్‌ తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం.

భారత్‌ ధోరణి: ఇక భారత్‌లో మాత్రం మొదటి త్రైమాసికంలో డిమాండ్‌ 15 శాతం పెరిగి 107.3 టన్నుల నుంచి 123.5 టన్నులకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఎక్సైజ్‌ సుంకం ప్రవేశపెట్టడంపై ఆభరణ వర్తకుల సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై ప్రధానంగా పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విలువ రూపంలో చూస్తే. డిమాండ్‌ 18 శాతం పెరిగి రూ. 27,540 కోట్ల నుంచి రూ.32,420 కోట్లకు చేరింది. దేశంలో ఈ కాలంలో డిమాండ్‌ పెరగడానికి డీమోనిటైజేషన్‌ కూడా ఒక కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది.

మరిన్ని వార్తలు