పసిడి డిమాండ్‌కు ధరాఘాతం!

4 May, 2018 00:21 IST|Sakshi

అధిక ధరతో జనవరి–మార్చి మధ్య 12% డౌన్‌

ఏకంగా 50 శాతం పడిపోయిన దిగుమతులు

260 టన్నుల నుంచి 153 టన్నులకు క్షీణత...

ముంబై: భారతదేశ బంగారం డిమాండ్‌ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి – మార్చి) 12 శాతం పడిపోయింది. అంటే 2017 మొదటి మూడు నెలల్లో 131.2 టన్నులుగా ఉన్న పసిడి డిమాండ్‌... 2018లో ఇదే కాలంలో 115.6 టన్నులకు తగ్గింది. ఇక దిగుమతులు సైతం ఇదే కాలంలో 50 శాతం పడిపోయాయి.

పరిమాణం రూపంలో 260 టన్నుల నుంచి 153 టన్నులకు చేరింది. ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీఆర్‌ సోమసుందరం సదరు నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. వాటిని చూస్తే...

క్యూ 1కు సంబంధించి డిమాండ్‌ విలువ రూపంలో 8 శాతం తగ్గి రూ.34,440  కోట్ల నుంచి రూ.31,800 కోట్లకు జారింది.
 ఆభరణాలకు డిమాండ్‌ 12 శాతం తగ్గి 99.2 టన్నుల నుంచి 87.7 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించి విలువ 7 శాతం తగ్గి, రూ.26,050 కోట్ల నుంచి రూ.24,130 కోట్లకు పడిపోయింది.
 పెట్టుబడులకు సంబంధించి డిమాండ్‌ 13 శాతం తగ్గి 32 టన్నుల నుంచి 27.9 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించిన విలువ 9 శాతం తగ్గి రూ. 8,390 కోట్ల నుంచి రూ. 7,660 కోట్లకు పడింది.
  రీసైకిల్డ్‌ గోల్డ్‌ డిమాండ్‌ కూడా 3 శాతం తగ్గింది. 14.5 టన్నుల నుంచి 14.1 టన్నులకు చేరింది.

కారణాలేమిటంటే...
 అధిక ధరలు, పెట్టుబడులకు సంబంధించి పసిడిపై ఆసక్తి తగ్గింది. పెళ్లి ముహూర్తాలు వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది క్యూ1లో తగ్గాయి.
 వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ)లోకి మార్చటం వల్ల ప్రత్యేకించి అసంఘటిత రంగం దెబ్బతింది.
♦  మొదటి త్రైమాసికంలో సహజంగానే పసిడి కొనుగోళ్లు ప్రోత్సాహంగా ఉండవు. పన్ను చెల్లింపుల వంటి ఆర్థిక అవసరాలకు ప్రజలు మొగ్గుచూపడమే దీనికి కారణం.
♦  2018 సంవత్సరం మొత్తంలో పసిడి డిమాండ్‌ 700 టన్నుల నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.
తగిన వర్షపాతం, గ్రామీణ ఆదాయాలు పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొత్తంగా బాగుండే అవకాశాలు పసిడి డిమాండ్‌ పటిష్టత కొనసాగడానికి దోహదపడతాయని డబ్ల్యూజీసీ విశ్వసిస్తోంది.


ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ధోరణి...
భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చూసినా మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ బలహీనంగానే ఉంది. డిమాండ్‌ అంతర్జాతీయంగా 7 శాతం తగ్గి 1,047 టన్నుల నుంచి 973 టన్నులకు పడిపోయినట్లు డబ్ల్యూజీసీ గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదిక పేర్కొంది. పెట్టుబడులకు డిమాండ్‌ తగ్గడమే దీనికి కారణమని నివేదిక వివరించింది. పెట్టుబడులకు సంబంధించి పసిడి డిమాండ్‌ 27 శాతం తగ్గి 394 టన్నుల నుంచి 287 టన్నులకు చేరింది.

ఈటీఎఫ్‌ల్లోకి ప్రవాహం 66 శాతం తగ్గి 96 టన్నుల నుంచి 32 టన్నులకు పడింది. ఆభరణాలకు డిమాండ్‌ 491.6 టన్నుల నుంచి 487.7 టన్నులకు పడింది. కాగా సెంట్రల్‌ బ్యాంకులు మాత్రం తమ బంగారం నిల్వలను 42 శాతం పెంచుకున్నాయి. ఈ నిల్వలు 82.2 టన్నుల నుంచి 116.5 టన్నులకు ఎగశాయి. కాగా టెక్నాలజీ రంగంలో పసిడి డిమాండ్‌ 4 శాతం వృద్ధితో 78.9 టన్నుల నుంచి 82.1 టన్నులకు చేరింది.  

మరిన్ని వార్తలు