సెన్సెక్స్‌కు కీలక స్థాయి 37,415

2 Mar, 2020 06:05 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

కరోనావైరస్‌ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒకేవారంలో ఎన్నడూ చూడనంత పెద్ద పతనం అంతర్జాతీయ  మార్కెట్లలో సంభవించింది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌...వడ్డీ రేట్ల కోత, ఇతర ఉద్దీపన చర్యలకు సిద్ధంగా వున్నట్లు గత శుక్రవారం ప్రకటించడంతో  ఆరోజున అమెరికా స్టాక్‌ సూచీలు కనిష్టస్థాయి నుంచి చాలావరకూ కోలుకున్నప్పటికీ, ఈ ఉద్దీపన ప్రకటన ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా  అన్నది అనుమానమే. చైనా కేంద్ర బ్యాంకు గత పదిరోజుల్లో ఇటువంటి ఎన్నో ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ దేశపు సూచీలు ఇంకా పతనబాటలోనే  వున్నాయన్నది గమనార్హం. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు  స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 28తో ముగిసినవారంలో 38,220 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే  2,873 పాయింట్ల  భారీనష్టంతో  38,297పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు భారీ కదలికల రీత్యా, ఈ వారం సైతం సెన్సెక్స్‌ ఎటువైపైనా వేగంగా  ప్రయాణించవచ్చు. గతేడాది అక్టోబర్‌ 9నాటి ‘స్వింగ్‌ లో’ అయిన 37,415 స్థాయి ఈ వారం సెన్సెక్స్‌కు ముఖ్యమైన తక్షణ మద్దతు. ఈ మద్దతుస్థాయిని  పరిరక్షించుకోగలిగినా, గ్యాప్‌అప్‌తో మొదలైనా....  క్రితంవారపు భారీ కరెక్షన్‌కు కౌంటర్‌ట్రెండ్‌ ర్యాలీ జరిగి 39,090 పాయింట్ల వద్దకు వెంటనే చేరగలదు. అటుపై  39,420 పాయింట్ల వరకూ ఎగిసే అవకాశం వుంటుంది. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 39,950–40,255 పాయింట్ల శ్రేణిని సైతం చేరే ఛాన్స్‌  వుంటుంది. అయితే తొలి మద్దతుస్థాయిని వదులుకుంటే డౌన్‌ట్రెండ్‌ మరింత వేగవంతమై 36,720 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే  35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు.  

11,090 వద్ద మద్దతు పొందితే నిఫ్టీ సేఫ్‌...
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,175 పాయింట్ల వరకూ పతనమై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 879 పాయింట్ల భారీనష్టంతో 11,202పాయింట్ల వద్ద  ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీకి సైతం  గతేడాది అక్టోబర్‌9నాటి ‘స్వింగ్‌ లో’ అయిన 11,090 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ స్థాయిని  పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మొదలైనా వేగంగా 11,385 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే 11,535 పాయింట్ల  వరకూ పెరగవచ్చు. అటుపై 11,660–11.780 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. తొలి మద్దతుస్థాయిని కోల్పోతే వేగంగా 10,930 పాయింట్ల వద్దకు  పడిపోవొచ్చు. 2018 అక్టోబర్‌ 23నాటి 10,004 పాయింట్ల నుంచి ఈ ఏడాది జనవరి 20 నాటి 12,430 పాయింట్ల రికార్డుస్థాయివరకూ జరిగిన  ర్యాలీకి ఈ 10,930 పాయింట్లు...61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి. ఈ స్థాయిని సైతం వదులుకుంటే ప్రస్తుత కరెక్షన్‌ మరెన్నో వారాలు కొనసాగే  ప్రమాదం వుంటుంది. ఈ వారం ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 10,670 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు.      

మరిన్ని వార్తలు