రూ. 8,400 కోట్ల నష్టపరిహారం రావాల్సిందే: జీఎంఆర్

26 Apr, 2014 03:50 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో తలెత్తిన వివాదంలో మాల్దీవుల ప్రభుత్వం నుంచి తమకు 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,400 కోట్లు) నష్ట పరిహారం రావాల్సిందేనని జీఎంఆర్ స్పష్టం చేస్తోంది. ‘తమ ప్రభుత్వం భారతీయ కంపెనీకి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. అయితే చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. న్యాయ సమ్మతమైనంత మొత్తానికి దీనిని కుదిస్తాం’ అంటూ మల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూం చేసిన ప్రకటన నేపథ్యంలో జీఎంఆర్ పై విధంగా స్పందించింది. పరిహారం చెల్లిస్తామని మాల్దీవుల ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించడం విశేషం.

మరోవైపు చట్టబద్ద కాంట్రాక్టు రద్దు చేసినందున నష్ట పరిహారం 1.4 బిలియన్ డాలర్లను చెల్లించాల్సిందేనని జీఎంఆర్ పట్టుబడుతోంది. కోర్టు వెలుపల పరిష్కారం కోసం మాల్దీవుల ప్రభుత్వం యత్నిస్తోందన్న వార్తలను జీఎంఆర్ ఖండించింది. కాగా, మాలె విమానాశ్రయ కాంట్రాక్టు రద్దు వివాద కేసు సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో నడుస్తోంది. గత వారం ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఇరువాదనలు విని కాంట్రాక్టు చట్టబద్దమా కాదా అన్నది విచారణ తొలిదశలో తేలుస్తారు. మే చివరి కల్లా ఈ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత ఎంత నష్ట పరిహారం చెల్లించాలో నిర్ణయమవుతుంది.

మరిన్ని వార్తలు