జీఎంఆర్‌ చేతికి క్రీట్‌ విమానాశ్రయ ప్రాజెక్టు

23 Feb, 2019 01:16 IST|Sakshi

టెర్నా గ్రూప్‌తో కలిసి నిర్మాణం

ప్రాజెక్టు వ్యయం రూ.4,034 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగంలో ఉన్న జీఎంఆర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చేతికి మరో విమానాశ్రయ ప్రాజెక్టు వచ్చి చేరింది. గ్రీస్‌లోని క్రీట్‌ రాజధాని నగరమైన హిరాక్లియోలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాంట్రాక్టును దక్కించుకుంది. గ్రీక్‌ కంపెనీ టెర్నా గ్రూప్‌తో కలిసి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ మేరకు ఇరు సంస్థలు కన్సెషన్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. ఒప్పందం కింద విమానాశ్రయ రూపకల్పన, నిర్మాణం, పెట్టుబడి, కార్యకలాపాలు, నిర్వహణను రెండు సంస్థల జాయింట్‌ వెంచర్‌ కంపెనీ చేపడుతుంది. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.4,034 కోట్లు. కన్సెషన్‌ పీరియడ్‌ 35 ఏళ్లు. ఈక్విటీ, ప్రస్తుత విమానాశ్రయం నుంచి అంతర్గత వనరులు, గ్రీస్‌ గవర్నమెంటు ఇచ్చే గ్రాంటు ద్వారా నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు రుణం అవసరం లేదని కంపెనీ తెలిపింది.

రెండవ అతిపెద్ద విమానాశ్రయం..
అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతాల్లో గ్రీస్‌ ముందు వరుసలో ఉంటుంది. ఏటా ఇక్కడికి 2.7 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారు. గ్రీస్‌లో ఎక్కువ మంది పర్యటిస్తున్న ద్వీపాల్లో క్రీట్‌ టాప్‌లో ఉంది. హిరాక్లియో విమానాశ్రయం గ్రీస్‌లో రెండవ అతిపెద్దది. మూడేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా 10% వృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా విమానాశ్రయ సా మర్థ్యం సరిపోవడం లేదు. యూరప్‌ ప్రాంతంలో కంపెనీకి ఇది తొలి ప్రాజెక్టు అని జీఎంఆర్‌ ఎనర్జీ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ బిజినెస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో మరింత విస్తరిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు