సెబు విమానాశ్రయంలో నిర్మాణ పనులు: జీఎంఆర్

8 Sep, 2014 01:19 IST|Sakshi
సెబు విమానాశ్రయంలో నిర్మాణ పనులు: జీఎంఆర్

సెబు(ఫిలిప్పైన్స్): మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ల కన్సార్షియం ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను నవంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. ఆరు నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తారు. 2015 మార్చి నుంచి విమానాశ్రయంలో నూతన భవనాన్ని నిర్మిస్తారు. 36 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని జీఎంఆర్-మెగావైడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ ఆండ్రూ హారిసన్ వెల్లడించారు.

విస్తరణ పూర్తి అయితే అధిక సీట్లు, ఏరోబ్రిడ్జ్‌లు, హోటళ్లు, క్యాసినో, కార్యాలయాలు, స్పా, దుకాణ సముదాయాలతోపాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విమానాశ్రయానికి ఏటా 45 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉంది. విస్తరణ పూర్తి అయితే ఈ సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంటుంది. జీఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం సుమారు రూ.1,920 కోట్లకు ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. కన్సార్షియంలో జీఎంఆర్‌కు 40 శాతం వాటా ఉంది.

మరిన్ని వార్తలు