‘మాలె ’ వివాదంలో జీఎంఆర్కు ఊరట

28 Oct, 2016 00:15 IST|Sakshi
‘మాలె ’ వివాదంలో జీఎంఆర్కు ఊరట

ఎయిర్‌పోర్టుపై ఆర్బిట్రేషన్‌లో మాల్దీవుల ప్రభుత్వానికి చుక్కెదురు
జీఎంఆర్‌కు 270 మిలియన్ డాలర్లు
చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలె అంతర్జాతీయ విమానాశ్రయ వివాదంలో ఇన్‌ఫ్రా దిగ్గజం  జీఎంఆర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ మాలె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జీఎంఐఏఎల్)కు ఊరట లభించింది. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్టు రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ జీఎంఐఏఎల్‌కు 270 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,800 కోట్లు) పరిహారం చెల్లించాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. రుణ మొత్తం, ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి, లీగల్ ఖర్చులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయని జీఎంఆర్ వెల్లడించింది.

మాల్దీవుల ప్రభుత్వం .. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సరికాదన్న తమ వాదనలే గెలిచాయని జీఎంఆర్ ప్రతినిధి పేర్కొన్నారు. ‘ట్రిబ్యునల్ ఆదేశాలు.. మా కార్పొరేట్ గవర్నెన్స్, అత్యున్నత స్థాయి ప్రమాణాలు, వ్యాపార విలువల పట్ల జీఎంఆర్ గ్రూప్ నిబద్ధతను నిరూపించేవిగా ఉన్నాయి’అని వ్యాఖ్యానించారు.

 ఇబ్రహీం నాసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆధునీకరణ, పాతికేళ్ల పాటు నిర్వహణకు సంబంధించి మాల్దీవుల ప్రభుత్వం (జీవోఎం) మాల్దీవ్స్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ (ఎంఏసీఎల్)తో జీఎంఐఏఎల్ 2010లో ఒప్పందం కుదుర్చుకుంది.

 జీఎంఆర్ ప్రణాళికల ప్రకారం ఈ ప్రాజెక్టులో సుమారు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఈ నిధుల్లో సింహభాగం 358 మిలియన్ డాలర్లు యాక్సిస్ బ్యాంకు రుణంగా అందించేలా జీఎంఆర్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే, ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ఫీజు కింద 25 డాలర్ల వసూలుపై వివాదం తలెత్తడం, ప్రాజెక్టు కేటాయింపు ప్రక్రియలో గత ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదంటూ ఆరోపణలు రావడం తదితర పరిణామాల మధ్య 2012లో జీఎంఐఏఎల్ ప్రాజెక్టును మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఏకపక్షంగా జరిగిందని, దీన్ని సవాల్ చేస్తూ జీఎంఆర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.  నష్టపరిహారం ఇప్పించాలంటూ కోరింది. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య అంతర్జాతీయ ట్రిబ్యునల్ తాజాగా తుది ఆదేశాలు ఇచ్చింది.

మరిన్ని వార్తలు