భారత్‌లో జీవన వ్యయం ఎంతో చౌక!

29 Jan, 2018 02:21 IST|Sakshi

ప్రపంచంలో దక్షిణాఫ్రికాకు మొదటి స్థానం

రెండో స్థానంలో భారత్‌

గోబ్యాంకింగ్‌రేట్స్‌ సర్వే  

హూస్టన్‌: ఈ ప్రపంచంలో చాలా చౌకగా జీవించేందుకు అనువైన దేశాల్లో భారత్‌ రెండో స్థానం దక్కించుకుంది. దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. గోబ్యాంకింగ్‌రేట్స్‌ అనే సంస్థ ఇటీవలి కాలంలో 112 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. స్థానికంగా కొనుగోలు శక్తిని ప్రతిబింబించే సూచీ, ఇంటి అద్దె సూచీ, గ్రోసరీల సూచీ, వినియోగ ధరల సూచీ అనే ఈ నాలుగు కొలమానాల ఆధారంగా ప్రపంచ దేశాలకు గోబ్యాంకింగ్‌ ర్యాంకులను కేటాయించింది.  

ఇంటి అద్దె నేపాల్‌ తర్వాత చాలా తక్కువగా ఉన్నది భారత్‌లోనే.
 వినియోగ ఉత్పత్తులు, గ్రోసరీలు కొన్ని మన దగ్గరే చాలా తక్కువ ధరలకు లభ్యమవుతున్నాయి. కోల్‌కతా నగరంలో ఓ వ్యక్తి నెలసరి వ్యయం 285 డాలర్లు.
 50 చౌక దేశాల్లో అధిక జనాభా ఉన్నది కూడా మనదగ్గరే (125 కోట్లు). టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇక్కడి ప్రధాన పరిశ్రమలు.
 భారత్‌లో స్థానిక కొనుగోలు శక్తి 20.9 శాతం తక్కువ. అద్దె 95.2 శాతం చౌక. గ్రోసరీలు 74.4 శాతం చౌక. స్థానిక సరుకులు, సేవలు కూడా 74.9 శాతం తక్కువే. స్థానిక కొనుగోలుశక్తిని, ఇంటి అద్దెలను, ఆహారోత్పత్తుల ధరలను న్యూయార్క్‌ సిటీతో పోల్చారు.
కొలంబియా (13), పాకిస్థాన్‌ (14), నేపాల్‌ (28), బంగ్లాదేశ్‌ (40) కంటే కూడా భారత్‌ నివాసానికి ఎంతో చౌక.
 జీవించడానికి, విశ్రాంత జీవనానికి దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశంగా ఈ సర్వే పేర్కొంది. ఖరీదైన ప్లాటినం, బంగారం, క్రోమియం లోహాలను భారీగా ఉత్పత్తి చేస్తుండడంతో ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి న్యూయార్క్‌ వాసుల కంటే ఎక్కువే ఉంది.
 ఇక జీవించేందుకు అత్యంత ఖరీదైన దేశంగా బెర్ముడా ముందుంది. దీని స్థానం 112 దేశాల్లో చిట్టచివరిది. బహమాస్‌ 111, హాంగ్‌కాంగ్‌ 110, స్విట్జర్లాండ్‌ 109, ఘనా 108 చొప్పున చివరి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు