ప్రాంతీయ భాషల బాట పట్టండి

13 Jun, 2020 08:47 IST|Sakshi

మరింత మంది యూజర్లకు చేరువ కావొచ్చు 

ఫిన్‌టెక్‌ సంస్థలకు నీతి ఆయోగ్‌ సీఈవో కాంత్‌ సూచన

న్యూఢిల్లీ: పెద్ద సంఖ్యలో వినియోగదారులకు మరింత చేరువ కావాలంటే కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే సర్వీసులు అందిస్తే కుదరదని, ప్రాంతీయ భాషల వైపు మళ్లాలని ఫిన్‌టెక్‌ సంస్థలకు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సూచించారు. అనేక భాషలు, యాసలు ఉన్న భారత్‌ వైవిధ్యాన్ని పట్టించుకోకపోతే చాలా మందికి చేరువ కాలేని రిస్కు ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఇంగ్లిష్‌ మర్చిపోండిక. ప్రాంతీయ భాషల బాట పట్టండి. ప్రస్తుతం అదొక్కటే మార్గం. వివిధ భాషల్లో స్థానికంగా సేవలు అందించడం ద్వారానే అందర్నీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావడం సాధ్యపడుతుంది.

ఫిన్‌టెక్‌ సంస్థలు అలా చేయకపోతే ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలకు ఊతం లేకుండా పోతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ వర్చువల్‌ సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా అమితాబ్‌ కాంత్‌ ఈ విషయాలు చెప్పారు. క్యాపిటల్‌ మార్కెట్ల విషయానికొస్తే మార్కెటింగ్‌ కార్యకలాపాలన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయని, దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి వీటి గురించి తెలియకుండా పోతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల వారు కూడా పాలుపంచుకుంటేనే వీటిలో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుందన్నారు.  

అపార అవకాశాలు..: రాబోయే రోజుల్లో ఫిన్‌టెక్‌ కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని కాంత్‌ చెప్పారు. కస్టమర్ల వివరాల సేకరణకు సంబంధించి కేవైసీ నిబంధనలను మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రక్రియ వ్యయాలు మరింతగా తగ్గించాల్సి ఉందన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు