ప్రథమార్ధంలో రూ. 2.88 లక్షల కోట్లు

27 Mar, 2018 01:53 IST|Sakshi

2018–19లో కేంద్రం రుణ సమీకరణ లక్ష్యం

ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్ల జారీ

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) కేంద్రం రూ. 2.88 లక్షల కోట్ల మేర రుణ సమీకరణ జరపనుంది. ఇది బడ్జెట్‌లో నిర్దేశించుకున్న స్థూల రుణ సమీకరణలో 47.56 శాతంగా ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కేంద్రం రూ. 3.72 లక్షల కోట్ల మేర స్థూల రుణ సమీకరణ జరిపింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ ఈ విషయాలు తెలిపారు.

మరోవైపు, రిటైల్‌ ద్రవ్యోల్బణ ఆధారిత ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌డ్‌ బాండ్లు కూడా ప్రభుత్వం జారీ చేయనుందని ఆయన వివరించారు. అలాగే 1–4 సంవత్సరాల స్వల్పకాలిక వ్యవధి  ఉండే బాండ్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గడిచిన అయిదేళ్లుగా బడ్జెట్‌లో నిర్దేశించుకున్న దాంట్లో 60–65 శాతం రుణ సమీకరణ ప్రథమార్ధంలో జరిగిందని, కొత్త ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గుతుందని గర్గ్‌ పేర్కొన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ బైబ్యాక్‌ పరిమాణం రూ. 25,000 కోట్ల మేర తగ్గించుకోవడంతో పాటు జాతీయ చిన్న మొత్తాల పొదుపు ఫండ్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) నుంచి రూ. 1 లక్ష కోట్ల దాకా ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది.

మరిన్ని వార్తలు