విదేశాల్లో ‘గోదావరి’ ఆతిథ్యం

13 Oct, 2016 00:15 IST|Sakshi
విదేశాల్లో ‘గోదావరి’ ఆతిథ్యం

గోదావరి రెస్టారెంట్ ప్రమోటర్లు కౌశిక్, తేజ
తెలుగు రుచులను ప్రపంచానికి పరిచయం చేయడానికే
ఇప్పటికే అమెరికాలో 12 రెస్టారెంట్లు
వచ్చే ఏడాది యూరప్... ఆ తర్వాత ఆస్ట్రేలియాలోకి

సాక్షి, అమరావతి : గుంటూరు కారం దోశె, బెజవాడ పెసరట్టు, కర్నూలు కోడి కూర, రాయలసీమ కోడి వేపుడు, కోనసీమ రొయ్యలు, గోదావరి పాయసం, కోస్తా కర్డ్ రైస్... ఏంటీ.. ఈ పేర్లు చదువుతుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయా? కానీ ఇవన్నీ తినాలంటే అమెరికా వెళ్లాలి!! ఎందుకంటే మన ప్రాంతానికే పరిమితమైన ఈ వంటకాలను అమెరికాకు పరిచయం చేశారు ఇద్దరు కుర్రాళ్లు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను వదిలేసి ‘గోదావరి’పేరుతో అమెరికాలో రెస్టారెంట్లు ప్రారంభించిన విజయవాడ యువకులు కోగంటి కౌశిక్, చేకూరి తేజలతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ...

అమెరికాలో రెస్టారెంట్ ప్రారంభించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
ఇండియాలో బీటెక్ అయ్యాక ఎంఎస్‌కు అమెరికా వచ్చాం. తర్వాత ఉద్యోగంలో చేరాం. ఇక్కడ మేం గమనించింది ఏంటంటే.. అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్ అంటే బిర్యానీ తప్ప పెద్దగా ఇతర వెరైటీలుండవు. అప్పుడే మన రుచులతో పాటు దక్షిణాది రుచులను ఇక్కడ పరిచయం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఇక్కడ రెస్టారెంట్లలో ఉండే సాధకబాధకాలను పూర్తిగా పరిశీలించాం. ఇక్కడి భారతీయులు, అమెరికన్లు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారో తెలుసుకున్నాం. సుదీర్ఘ కసరత్తు తర్వాత ‘గోదావరి’ పేరుతో దక్షిణ భారతదేశ రుచులను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాం.

విజయవాడ నుంచి వచ్చిన మీరు ‘గోదావరి’ పేరు ఎంచుకోవడానికి కారణం?
ఆతిథ్యానికి ‘గోదావరి’ జిల్లాలు పెట్టింది పేరు. అందుకే ఈ పేరును ఎంచుకున్నాం. అలాగే అన్ని ప్రాంతాలకు చెందిన రుచులతో మెనూ రూపొందించాం. దీనికి మంచి స్పందన వస్తోంది. భారతీయులే కాకుండా అమెరికన్లు కూడా క్రమం తప్పకుండా రెస్టారెంట్లకు వస్తున్నారు. అమెరికన్లు కారం తినరు అన్న ప్రచారం ఒట్టి అపోహ అన్నది స్పష్టమయింది.

ఉద్యోగాలు వదిలి రెస్టారెంట్ల వ్యాపారంలోకి వస్తుంటే కుటుంబీకులు ఏమీ అనలేదా?
ఇది అందరికీ సహజం. స్థిరమైన ఆదాయం వచ్చే ఉద్యోగం వదిలేసి వ్యాపారంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఇటువంటివి సహజం. కానీ మా విషయంలో ఇది కొద్దిగా తక్కువే. మాపై నమ్మకం ఉంచి ప్రోత్సహించారు. దీంతో ఏడాది కాలంలోనే 12 రెస్టారెంట్ల స్థాయికి చేరుకున్నాం. ఇందులో రెండు సొంతంగా నిర్వహిస్తుండగా మిగిలిన పది ఫ్రాంచైజీ మోడల్‌లో నిర్వహిస్తున్నాం.

ఎంత పెట్టుబడితో ప్రారంభించారు? విస్తరణ కోసం నిధులేమైనా సమీకరిస్తున్నారా?
తొలుత రూ. 1.50 కోట్ల సొంత నిధులతో ప్రారంభించాం. ఏడాదిలో వ్యాపారం రూ.130 కోట్లకు చేరింది. ఏటా కనీసం పది రెస్టారెంట్లను అమెరికాలో ప్రారంభించాలని లక్ష్యించాం. వచ్చే నెలల్లో మరో నాలుగు రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నాం. త్వరలో యూరప్, ఆస్ట్రేలియాల్లోనూ ’గోదావరి’ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాం. వచ్చే ఏడాది బ్రిటన్‌లో సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నాం. వ్యాపార విస్తరణకు ప్రస్తుతం నిధులను సేకరించే ఆలోచన లేదు. అలాగే స్వదేశంలో కూడా రెస్టారెంట్లను ప్రారంభించే ఆలోచన లేదు.

ప్రస్తుతం మీ సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు?
రెస్టారెంట్ వ్యాపారంలో షెఫ్‌ల పాత్ర కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి మంచి షెఫ్‌లను ఎంపిక చేసుకుంటున్నాం. ప్రతీ రెస్టారెంట్‌కు కనీసం నలుగురైదుగురు షెఫ్‌లు కావాలి. మా దగ్గర 60 మంది వరకు షెఫ్‌లున్నారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 130 దాటింది.

‘గోదావరి’ తదుపరి లక్ష్యం ఏమిటి?
స్థానిక రుచులతో కూడిన నాణ్యమైన ఆహారం అందించడమే. దీన్ని చివరకు వరకు కొనసాగిస్తాం. ప్రపంచవ్యాప్తంగా తమిళుల కోసం ‘శర్వణ భవన్’ ఎలా ఉందో మన తెలుగువారి కోసం అలా ‘గోదావరి’ని తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. తెలుగువాళ్లు నివసించే చోటల్లా ‘గోదావరి’ని పరిచయం చేస్తాం.

మరిన్ని వార్తలు