గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రెండు రెట్లు 

14 Feb, 2019 01:16 IST|Sakshi

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లకు పైగా పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.121 కోట్లకు ఎగసిందని గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,169 కోట్ల నుంచి రూ.2,576 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.2,580 కోట్లకు చేరాయని తెలిపింది.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.6 శాతం నష్టపోయి రూ.483 వద్ద ముగిసింది.   భారత్‌ ఫోర్జ్‌ లాభం రూ.310 కోట్లు   వాహన విడిభాగాలు తయారు చేసే భారత్‌ ఫోర్జ్‌ లాభం ఈ క్యూ3లో 36 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.228 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.310 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,412 కోట్ల నుంచి రూ.1,740 కోట్లకు పెరిగింది. అన్ని విభాగాల్లో మంచి పనితీరు సాధించామని కంపెనీ సీఎమ్‌డీ బి.ఎన్‌. కళ్యాణి పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలు, పారిశ్రామిక రంగాల నుంచి 65 లక్షల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను సాధించామని తెలిపారు. నాలుగో క్వార్టర్‌లో కూడా డిమాండ్‌ జోరు కొనసాగగలదని ఆయన అంచనా వేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అమిత్‌ బి. కళ్యాణి పునః నియామాకాన్ని డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని, ఈ ఏడాది మే 11 నుంచి ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు.   బీఎస్‌ఈలో కంపెనీ షేర్‌ 1.4 శాతం నష్టపోయి రూ.477 వద్ద ముగిసింది. 

టేక్‌ సొల్యూషన్స్‌ డివిడెండ్‌ 30 పైసలు  
జీవ శాస్త్ర, సరఫరా చెయిన్‌  మేనేజ్‌మెంట్‌ కంపెనీ టేక్‌ సొల్యూషన్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో రూ.36 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ3లో రూ.42 కోట్ల నికర లాభం వచ్చిందని వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.409 కోట్ల నుంచి రూ.524 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  ఒక్కో షేర్‌కు 30 పైసలు (30 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది.   తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే,  నికర లాభం రూ.114 కోట్ల నుంచి రూ.151 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.1,137 కోట్ల నుంచి రూ.1,529 కోట్లకు పెరిగాయని  తెలిపింది. ఈ క్యూ3లో నికర లాభం తగ్గడంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ 5 శాతం పతనమై రూ.119 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.116ను తాకింది. 

అదానీ ట్రాన్సిమిషన్‌ లాభం రూ.189 కోట్లు  
అదానీ ట్రాన్సిమిషన్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.189 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ3లో రూ.842 కోట్ల నికర లాభం వచ్చిందని అదానీ ట్రాన్స్‌మిషన్‌ పేర్కొంది.రూ.742 కోట్ల వన్‌–టైమ్‌ ఇన్‌కమ్‌ కారణంగా ఈ స్థాయిలో గత క్యూ3లో లాభం సాధించామని వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకుకంటే గత క్యూ3లో రూ. 100 కోట్ల లాభమే వచ్చినట్లవుతుందని తెలిపింది. గత క్యూ3లో రూ.1,806 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,921 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 2022 కల్లా అందరికీ విద్యుద్తును అందించాలనేది భారత ప్రభుత్వం లక్ష్యమని, అందుకే తాము కీలకమైన జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు.  
ఫలితాలు సానుకూలంగా ఉండటంతో బీఎస్‌ఈలో అదానీ ట్రాన్సిమిషన్‌ షేర్‌  2 శాతం లాభపడి రూ.216 వద్ద ముగిసింది.  

మరింత పెరిగిన సీజీ పవర్‌ నష్టాలు  
సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కంపెనీ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.28 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.150 కోట్లకు ఎగిశాయని సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,537 కోట్ల నుంచి రూ.1,731 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నికర నష్టాలు రూ.584 కోట్ల నుంచి రూ.262 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,569 కోట్ల నుంచి రూ.4,884 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  నికర నష్టాలు భారీగా పెరగడంతో ఈ షేర్‌ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.23.5ను తాకిన ఈ షేర్‌ చివరకు 30 శాతం నష్టంతో రూ.23.75 వద్ద ముగిసింది. 

బాష్‌ లాభం రూ.335 కోట్లు  
వాహన విడిభాగాలు తయారు చేసే బాష్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.335 కోట్ల నికర లాభం (స్డాండోలోన్‌)సాధించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.281 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని బాష్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,174 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వ్యయాలు రూ.2,784 కోట్లకు చేరాయని తెలిపింది. భాస్కర్‌ భట్‌ను ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా రెండోసారి నియామకానికి  కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. జాయింట్‌ ఎమ్‌డీగా ఆండ్రియాస్‌ ఓల్ఫ్‌ను మళ్లీ డైరెక్టర్ల బోర్డ్‌ నియమించిందని పేర్కొంది.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బాష్‌ షేర్‌ 4 శాతం నష్టపోయి రూ.17,898 వద్ద ముగిసింది.

రుచి సోయా లాభం రూ.6 కోట్లు  
దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న రుచి సోయా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.6 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,960 కోట్ల నికర నష్టాలు వచ్చా యని రుచి సోయా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,050 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కంపెనీ రుణభారం రూ.12,000 కోట్లుగా ఉంది. న్యూట్రెలా, మహా కోశ్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి గోల్డ్‌ బ్రాండ్ల వంటనూనెలను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఫారŠూచ్యన్‌ బ్రాండ్‌ వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్, బాబా  రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి కంపెనీలు ఈ కంపెనీ కొనుగోలు రేసులో ఉన్నాయి.   బీఎస్‌ఈలో రుచి సోయా షేర 0.3 శాతం  నష్టంతో రూ.6 వద్ద ముగిసింది.

ఫోర్టిస్‌కు రూ.180 కోట్ల నష్టాలు  
ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.180 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. గత క్యూ3లో నష్టాలు రూ.19 కోట్లని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది. అసాధారణమైన వ్యయాల కారణంగా  ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. ఆదాయం రూ.1,121 కోట్ల నుంచి రూ.1,103 కోట్లకు తగ్గిందని పేర్కొంది.  

బోర్డులోకి ఐదుగురు ఐహెచ్‌హెచ్‌ నామినీలు  
డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించామని, ఐహెచ్‌హెచ్‌ నామినీలను ఐదుగురిని డైరెక్టర్లుగా నియమించామని కంపెనీ చైర్మన్‌ రవి రాజగోపాల్‌ చెప్పారు. కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా వివేక్‌ కుమార్‌ గోయల్‌ను నియమించామని తెలిపారు. ఆయన నియామకం ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు.   నికర నష్టాలు భారీగా రావడంతో  బీఎస్‌ఈలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌  0.26 శాతం తగ్గి రూ.135 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా