గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కింద 6.4 టన్నుల సేకరణ

11 Mar, 2017 01:29 IST|Sakshi
గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కింద 6.4 టన్నుల సేకరణ

గోల్డ్‌ డిపాజిట్‌ (మోనిటైజింగ్‌) స్కీమ్‌ కింద ప్రభుత్వం 6.4 టన్నుల పసిడిని  సేకరించినట్లు లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌  ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇళ్లు, దేవాలయాలు, సంస్థల్లో ఉపయోగించకుండా ఉన్న పసిడిని తిరిగి మార్కెట్‌లోకి తీసుకుని వచ్చి, వినియోగంలోకి తీసుకురావడం, దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికింద 2017 ఫిబ్రవరి 17 నాటికి 6,410 కేజీల పసిడిని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ధర ప్రకారం సేకరించిన బంగారం విలువ రూ.1,850 కోట్లు. 2015 నవంబర్‌లోనే ప్రకటించిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ ప్రకారం ఇప్పటివరూ ఏడు విడతల బాండ్స్‌ జారీ జరిగినట్లు మంత్రి తెలిపారు.

ఢిల్లీ విమానాశ్రయంలో నకిలీ బంగారం...
2016 డిసెంబర్‌ 31వ తేదీ వరకూ గడచిన నాలుగేళ్లలో ఢిలీవిమానాశ్రమంలో పట్టుబడిన పసిడిలో 91 కేజీలు నకిలీదిగా గుర్తించినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ తెలిపారు. ఢిల్లీ కస్టమ్స్‌ వాలెట్‌లో ఉంచిన  1,681.60 కేజీల్లో 91 కేజీలను కల్తీదిగా గుర్తించినట్లు వివరించారు.

స్మార్ట్‌ఫోన్‌తో పన్ను చెల్లింపులు!
స్మార్ట్‌ఫోన్‌ ద్వారా నిమిషాల్లోనే పాన్‌ నంబరు అందించే విధంగా ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ తయారీపై కసరత్తు చేస్తోంది. అలాగే ఆన్‌లైన్లో సత్వరం పన్ను చెల్లింపులు, రిటర్నుల ట్రాకింగ్‌ మొదలైన సదుపాయాలకు ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ లోక్‌సభలో ఈ విషయాన్ని తెలిపారు.

సీఎస్‌ఆర్‌ నిబంధనల ఉల్లంఘనలకు నోటీసులు
కంపెనీల చట్టాల ప్రకారం కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల (సీఎస్‌ఆర్‌) నిబంధనలను ఉల్లంఘించిన 1,018 కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. మూడు సంవత్సరాల వార్షిక సగటు నికర లాభంలో కనీసం 2 శాతాన్ని లాభదాయక కంపెనీలు సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు వినియోగించాల్సి ఉంటుంది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచీ సీఎస్‌ఆర్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

‘క్లీన్‌ మనీ’కి 8.38 లక్షల మంది జవాబు
పెద్ద  నోట్ల రద్దు అనంతరం అనుమానాస్పద డిపాజిట్ల పరిశోధన బాటలో చేపట్టిన ‘క్లీన్‌ మనీ’ పథకం కింద 18 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ ఎస్‌ఎంఎస్‌/ఈ మెయిల్‌ ప్రశ్నలను పంపితే, వారిలో 8.38 లక్షల మంది సమాధానం పంపినట్లు మంత్రి గంగ్వార్‌ లోక్‌సభలో తెలిపారు. మిగిలిన వారిపై తగిన చర్యలకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తం అవుతున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు