బంగారం కూడా పెట్టుబడే!!

30 Apr, 2018 00:05 IST|Sakshi

అమ్మాయిల చిన్న వయసు నుంచే వారి వివాహ అవసరాల కోసం తల్లిదండ్రులు అప్పుడప్పుడు బంగారు ఆభరణాలు కొంటుంటారు. పెళ్లి సమయంలో ఒకేసారి అంత సమకూర్చుకోలేమనుకునే వారు ఇలా చేస్తుంటారు. అయితే, బంగారం కోసమని ఆభరణాలు కొనడం అధిక వ్యయాలతో కూడినదే. ఎందుకంటే ఆమె పెద్దయ్యాక ఆ ఆభరణాలు నచ్చకపోతే వాటిని మార్చి కొత్తవి తీసుకోవడం వల్ల కొంత నష్టపోవాల్సి ఉంటుంది. 10 శాతం వరకూ తరుగు తీసేస్తారు. కొత్త ఆభరణాలు కొనేటపుడూ 10–15 శాతం వరకు తయారీ వృ«థా పేరిట తీసేస్తారు. కనుక అమ్మాయి భవిష్యత్తు అవసరాల కోసం బంగారం కావాలనుకుంటే అందుకు సార్వభౌమ బంగారం బాండ్లు అనువైనవి. కేంద్రం అందిస్తున్న బాండ్లు ఇవి. బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ నుంచి కొనొచ్చు.

పెట్టుబడి మొత్తానికి ఎన్ని గ్రాముల బంగారం వస్తుందో ఆ మేరకు బాండ్లను జారీ చేస్తారు. బంగారం మార్కెట్‌ రేటు ఆధారంగానే ఈ బాండ్ల విలువ పెరగడం, తరగడం జరుగుతుంది. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ముందుగా వైదొలగవచ్చు. అయితే, బాండ్లు జారీ అయిన 15 రోజుల తర్వాత అవి స్టాక్‌ ఎక్సే్చంజ్‌లలో లిస్ట్‌ అవుతాయి. దాంతో ఎప్పుడు అవసరమైనా వాటిని విక్రయించుకోవచ్చు. ఆభరణాలకు ఉన్నట్టు తయారీ చార్జీలు, తరుగు వంటి చిల్లులు ఇందులో ఉండవు. బాండ్ల రూపంలో ఉండడం వల్ల భద్రత సమస్య కూడా ఉండదు. ఇందులో ఉన్న మరో ఆకర్షణీయత ఏటా 2.5 శాతం వడ్డీని బాండ్‌ హోల్డర్లకు చెల్లించడం. బాండ్‌ కాల వ్యవధిలో ఒకవేళ బంగారం రేటు పెరిగితే ఆ మేరకు విలువ పెరుగుతుంది. ఏటా లభించే 2.5 శాతం వడ్డీ అదనం. ఈ లెక్కన చూస్తే భౌతిక బంగారం కంటే సౌర్వభౌమ బంగారం బాండ్లే లాభదాయకం.  

మరిన్ని వార్తలు