బంగారం, వెండి.. ధరల ధగధగ

22 Jul, 2020 10:55 IST|Sakshi

9ఏళ్ల గరిష్టానికి పసిడి- ఏడేళ్ల గరిష్టానికి వెండి 

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ 1858 డాలర్లకు

2011 సెప్టెంబర్‌లో 1865 డాలర్లకు పసిడి

2013 అక్టోబర్‌ తదుపరి గరిష్టానికి వెండి ధర

7 శాతం పెరిగి ఔన్స్‌ 23 డాలర్లకు చేరువైన వెండి

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 50,000 చేరువకు

రూ. 60,500కు జంప్‌చేసిన కేజీ వెండి ధర

ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటా పాకిన కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో మరోసారి అమెరికాసహా పలు దేశాలను వణికిస్తుండటంతో బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా విదేశీ మార్కెట్లో దాదాపు 9ఏళ్ల గరిష్టాన్నితాకింది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1 శాతం బలపడి 1858 డాలర్లకు చేరింది.  ఇది స్పాట్‌ మార్కెట్‌ ధరకాగా.. ఫ్యూచర్స్‌లోనూ ఇదే స్థాయిలో ఎగసి 1858 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 1865 డాలర్లను తాకింది. ఇంతక్రితం 2011 సెప్టెంబర్‌లో మాత్రమే 1865 డాలర్లకు చేరింది. వెరసి 2011లో నమోదైన 1921 డాలర్ల చరిత్రాత్మక గరిష్ట రికార్డుకు చేరువైంది. ఇక వెండి మరింత అధికంగా ఔన్స్‌ 7 శాతం జంప్‌చేసి 22.8 డాలర్లను తాకింది. 2013 అక్టోబర్‌ తదుపరి గరిష్టాన్ని అందుకుంది. 

ప్యాకేజీల ఎఫెక్ట్‌
కోవిడ్‌-19 కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థలకు చేయూత నిచ్చేందుకు మంగళవారం యూరోపియన్‌ దేశాల నేతలు 750 బిలియన్‌ యూరోల ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. మరోవైపు లక్షల సంఖ్యలో కోవిడ్‌-19 బారినపడుతున్న అమెరికన్లను ఆదుకునేందుకు వాషింగ్టన్‌ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లతో మరో ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ నాలుగు నెలల కనిష్టానికి బలహీనపడింది. ఇక ఆసియా దేశాలలో బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ఇప్పటికే సహాయక ప్యాకేజీలను అమలు చేస్తోంది. అయినప్పటికీ వరుసగా 15వ నెలలోనూ తయారీ రంగం వెనకడుగు వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక మరోపక్క యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్‌ నీరసిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు బంగారానికి డిమాండ్‌ కనిపించే సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత అనిశ్చిత పరిస్థతులలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సావరిన్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ తదితర ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు బంగారం కొనుగోలుకి ఎగబడుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

దేశీయంగా 
విదేశీ మార్కెట్లో బంగారం ధరలు మెరుస్తుండటంతో దేశీయంగానూ ఈ ప్రభావం పడింది. ఫ్యూచర్‌ మార్కెట్లో అంటే ఎంసీఎక్స్‌లో  ప్రస్తుతం ఆగస్ట్‌ డెలివరీ 10 గ్రాముల పసిడి రూ. 439 ఎగసి రూ. 49,966 వద్ద కదులుతోంది. ఇది 1 శాతం అధికంకాగా.. ఇంట్రాడేలో రూ. 49,996కు చేరింది. వెరసి రూ. 50,000 మార్క్‌కు చేరువైంది. ఈ బాటలో వెండి కేజీ సెప్టెంబర్‌ డెలివరీ 5.5 శాతం ఎగసింది. ఏకంగా రూ. 3093 దూసుకెళ్లి రూ. 60,435 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 60,782ను తాకింది.

మరిన్ని వార్తలు