గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

7 Aug, 2019 11:56 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సౌర్వభౌమ బంగారం బాండ్ల పథకంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో మూడో విడత పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. గ్రాముకు రూ.3,499గా ధర నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 5న ఆరంభం కాగా, ఈ నెల 9వ తేదీన ముగుస్తుంది. ఆగస్టు 14వ తేదీన అర్హులైన వారికి బాండ్లను జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అటువంటి ఇన్వెస్టర్లు గ్రాముకు చెల్లించాల్సింది రూ.3,449 మాత్రమేనన్న మాట. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో బంగారం ధర నూతన గరిష్టాలకు చేరిన తరుణంలో ప్రభుత్వం బాండ్ల ఇష్యూను చేపట్టడం గమనార్హం. ఇందులో పెట్టుబడులను కనీసం 8 ఏళ్లు కొనసాగించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరపై ఏటా 2.5 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లించడం జరుగుతుంది. మెచ్యూరిటీ సమయానికి మార్కెట్‌ ధర ప్రకారం బాండ్లపై చెల్లింపులు జరుగుతాయి.

మరిన్ని వార్తలు