పుత్తడి బాండ్ల కలెక్షన్ రూ. 150 కోట్లే

23 Nov, 2015 03:22 IST|Sakshi

ఇష్యూ ధర అధికంగా ఉండడడే కారణం
ముంబై: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఆరంభించిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌కు తగిన స్పందన లభించలేదు.  రూ. 150 కోట్లకు మాత్రమే గోల్డ్‌బాండ్లకు దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఇష్యూ ధర(గ్రాములకు రూ.2,684) అధికంగా ఉండడం దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ రంగ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సెలవు రోజులు రావడం, బంగారాన్ని బాండ్ల రూపంలో కాకుండా ఆభరణాలుగా గానో, బిస్కట్‌ల రూపంలోనే ఉంచుకోవడంపైనే ప్రజలు మక్కువ చూపడం వంటి అంశాలు కూడా పేలవమైన స్పందనకు కారణమని వారంటున్నారు.

గోల్డ్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం నిధులు వచ్చాయో ఆర్‌బీఐ వెల్లడించనప్పటికీ, రూ.150 కోట్ల వరకూ ఉండొచ్చని బ్యాంకర్లు భావిస్తున్నారు. గ్రాముకు రూ.2,684 ఇష్యూధరగా ఆర్‌బీఐ నిర్ణయించిందని, ఇది  మార్కెట్ ధర కన్నా ఎక్కువని ఒక ప్రభుత్వ బ్యాంక్ ఉన్నతాధికారి చెప్పారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు అధిక ధరకు ఈ బాండ్లను ఎవరు కొంటారని ఆయన ప్రశ్నించారు.

ఈ గోల్డ్ బాండ్ల  ద్వారా రూ.50 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ దీంట్లో పదవ వంతు కూడా సమీకరించలేకపోయామని చెప్పారు. ప్రధాని మోదీ ఈ నెల 5న మూడు పుత్తడి పథకాలను ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ మోనోటైజేషన్, గోల్డ్ కాయిన్ స్కీమ్‌లను ఆరంభించారు. గోల్డ్ బాండ్ స్కీమ్‌కు సంబంధించి మొదటి దశ ఈ నెల 5న ప్రారంభమై 20న ముగిసింది.

>
మరిన్ని వార్తలు