గణాంకాలే కీలకం..

11 Apr, 2016 01:01 IST|Sakshi
గణాంకాలే కీలకం..

న్యూఢిల్లీ: రెండు రోజుల సెలవుల కారణంగా మూడు రోజులే ట్రేడింగ్ ఉండే ఈ వారంలో గణాంకాలు కీలకమని నిపుణులంటున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని,  విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. బాబా సాహెబ్  అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న(గురువారం), శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 15న(శుక్రవారం) మార్కెట్‌కు సెలవులు. ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైనందున ఒడిదుడుకులుండవచ్చని, వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పరిమితంగానే ట్రేడింగ్‌లో పాల్గొనడం దీనికి ప్రధాన కారణమని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.
 
పరిమితంగా ట్రేడింగ్: ఈ నెల 12(మంగళవారం)న వెల్లడయ్యే  ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి, మార్చి నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను నడిపిస్తాయని సింఘానియా వివరించారు. కంపెనీలు వెల్లడించే గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలే.. సమీప కాలంలో  స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే కీలక అంశమని తెలిపారు. శుక్రవారం వెల్లడయ్యే ఇన్ఫోసిస్ ఫలితాలతో క్యూ4 ఫలితాల సీజన్ ఆరంభం కానున్నది.

రెండు రోజుల సెలవుల కారణంగా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పరిమితంగా ట్రేడింగ్ జరుపుతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం టోకు ధరల సూచీ గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. కానీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ రోజు సెలవు కారణంగా ఈ గణాంకాలను ఈ నెల 18న (వచ్చే సోమవారం) వెల్లడిస్తారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, చైనా ట్రేడ్ బ్యాలెన్స్ గణాంకాలు ఈ నెల 12న, అమెరికా ముడి చమురు నిల్వల గణాంకాలు ఈ నెల 13న(బుధవారం), చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 14న(గురువారం)వెలువడతాయి.
 
రెండో నెలలోనూ బుల్లిష్‌గానే...

భారత స్టాక్ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండో నెలలోనూ బుల్లిష్‌గానే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,600 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలతో గత నెలలో రూ.19,967 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.7,964 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.3,202 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.

మొత్తం వీరి నికర పెట్టుబడులు రూ.4,762 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ నెల పెట్టుబడుల విషయానికి వస్తే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీల్లో రూ.3,469 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.4,152 కోట్లు చొప్పున మొత్తం రూ.7,625 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆర్‌బీఐ రేట్ల కోత కారణంగా బాండ్ ధరలు ర్యాలీ జరిపాయని, ఫలితంగా ఎఫ్‌పీఐల నుంచి మరిన్ని నిధులు వచ్చాయని ఎస్‌ఏఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సిద్ధాంత్ జైన్ చెప్పారు.

మరిన్ని వార్తలు