గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు

12 Jun, 2017 01:36 IST|Sakshi
గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో అనాసక్తి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు ఏప్రిల్, మేలో రూ.137 కోట్ల విలువ మేర గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఇన్వెస్టర్లు విక్రయించి తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో 14 గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో రూ.66 కోట్ల మేర, మే నెలలో రూ.71 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో రాబడులు తీసికట్టుగా ఉండడం, అదే సమయంలో ఈక్విటీల్లో మెరుగైన రాబడుల నేపథ్యంలో ఈ విక్రయాలు చోటు చేసుకోవడం గమనార్హం.

ఎందుకంటే ఇదే కాలంలో ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్‌లలో నికర పెట్టుబడులు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు అనాదరణే ఎదురవుతోంది. 2013–14లో రూ.2,293 కోట్లు, 2014–15లో రూ.1,475 కోట్లు, 2015–16లో రూ.903 కోట్ల మేర గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో నికర విక్రయాలు చోటు చేసుకున్నాయి. 2016–17లో మాత్రం అమ్మకాలు కొంచెం నెమ్మదించాయి. గోల్డ్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ ఈ ఏడాది మే నెల చివరికి రూ.5,298 కోట్లకు తగ్గాయి.

 అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్‌కు (31.10 గ్రాములు) 2012–13లో గరిష్ట స్థాయి 1,900 డాలర్లు నుంచి క్షీణించిన తర్వాత 1,050 – 1,350 డాలర్ల మధ్యలోనే స్థిరపడినట్టు మార్నింగ్‌ స్టార్‌ ఫండ్‌ రీసెర్చ్‌ హెడ్‌ కౌస్తభ్‌ బేలపుర్కార్‌ తెలిపారు. ‘‘ధరలు క్షీణించడం, రూపాయి బలపడడానికి తోడు ఈక్విటీ మార్కెట్లు మెరుగ్గా రాణిస్తున్నాయి. గోల్డ్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా అంతగా ప్రాచుర్యం పొందిన ఆప్షన్లు కావు. ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులను గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు కేటాయించకపోగా, క్రమంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు’’ అని బేలపుర్కార్‌ వివరించారు.

మరిన్ని వార్తలు