నాలుగు నెలల గరిష్టానికి పసిడి

29 Jan, 2018 01:58 IST|Sakshi

మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందంటున్న నిపుణులు  

అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్సే్ఛంజ్‌– నైమెక్స్‌లో పసిడి తిరిగి నాలుగు నెలల గరిష్టస్థాయిని తాకింది. వారం మధ్యలో ఒక దశలో 1,365 డాలర్ల స్థాయికి చేరిన ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర వారం చివరిలో లాభాల స్వీకరణతో 1,348 స్థాయి వద్ద ముగిసింది. వారం వారీగా 22 డాలర్లు బలపడింది. అమెరికాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, డాలర్‌ ఇండెక్స్‌ మూడేళ్ల కనిష్ట స్థాయికి పతనం (వారం మధ్యలో 88.30 స్థాయిని తాకి వారం చివరిలో 88.87 వద్ద ముగింపు) వంటి అంశాలు పసిడి బలానికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం కొంత కన్సాలిడేషన్‌ దశలో ఉన్న పసిడి 1,400 డాలర్ల స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల విశ్లేషణ. 1,310 పసిడికి తక్షణ మద్దతని వారి అభిప్రాయం. అయితే ఈ దశలో కొంత ఒడిదుడుకులు ఉంటాయన్నది వారి వాదన. ఈ వారం ఫెడరల్‌ రిజర్వ్‌ మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం జరగనుంది.  జనవరి ఉపాధి అవకాశాల కల్పన గణాంకాలు కూడా వెలువడనున్నాయి.

నిజానికి ఆయా అంశాలు పసిడి ధర గతిని నిర్ణయించాల్సి ఉంది. అయితే అమెరికా  పాలనాయంత్రాంగం కరెన్సీ మార్కెట్లలో ఒడిదుడుకులను సృష్టిస్తోందని, దీంతో డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకులకు గురవుతుందనీ, ఇదే ధోరణి పసిడిలోనూ కనిపిస్తుందన్నది విశ్లేషణ.  

దేశీయంగా...: ఇక దేశీయంగా చూస్తే,  ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ.592 పెరిగి రూ.30,361కి చేరింది. ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్‌లో ధర 99.9 స్వచ్ఛత ధర రూ.420 పెరిగి రూ.30,595కు చేరింది.

మరిన్ని వార్తలు