పసిడికి ‘డాలర్’ బూస్ట్

2 May, 2016 06:14 IST|Sakshi
పసిడికి ‘డాలర్’ బూస్ట్

లాభాల స్వీకరణ ఉంటుందంటున్న నిపుణులు
ముంబై: డాలరు బలహీనత, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా అట్టిపెట్డడం,  అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు... వెరసి పసిడికి బలం చేకూర్చుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు విలువ దిగజారడం గతవారం ప్రపంచ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమయ్యింది. డాలరు బలపడితే పసిడిని విక్రయించడం, డాలరు క్షీణిస్తే బంగారాన్ని కొనడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సమీపకాలంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా... పసిడి మెరుపులు కొనసాగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు.

అయితే ఇప్పటికే రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో సమీప కాలంలో లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల దిగువకు పడిపోయే పరిస్థితి లేదని వారి అంచనా. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ నెమైక్స్‌లో గడచిన శుక్రవారం నాటికి పసిడి వారం వారీగా చురుగ్గా ట్రేడవుతున్న జూన్ డెలివరీ ఔన్స్ ధర 70 డాలర్లు ఎగసి 1,290.50 డాలర్లకు చేరింది.  

దేశీయంగానూ పరుగు..
అంతర్జాతీయ పటిష్ట ధోరణితోపాటు దేశీయంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ పసిడికి డిమాండ్ పెంచింది. వరుసగా నాల్గవవారమూ  లాభపడింది. ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయికి ఎగశాయి. ప్రధాన స్పాట్ మార్కెట్- ముంబైలో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర వారం వారీగా రూ.465 పెరిగి రూ.29,820కి చేరింది. ఇక 99.9 ప్యూరిటీ ధర సైతం అంతే స్థాయిలో ఎగసి 29,970కి ఎగసింది. ఒక దశలో ధర రూ.30,000 దాటడం గమనార్హం. వెండి కేజీ ధర రూ.1,075 పెరిగి రూ.41,875కు చేరింది.

మరిన్ని వార్తలు