స్వల్ప నష్టంతో ముగిసిన పసిడి

13 Jun, 2020 09:48 IST|Sakshi

అంతర్జాతీయంగా అదే ధోరణి

దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం పసిడి ఫ్యూచర్ల ధర స్వల్ప నష్టంతో ముగిసింది. ఆగస్ట్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.80లు నష్టపోయి రూ. 47334.00 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు ఊహించని రీతిలో నష్టాల నుంచి రికవరీ కావడంతో పసిడి ఫ్యూచర్లపై ఒత్తిడిని కలిగించింది. అలాగే అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవడంతో సెంటిమెంట్‌ బలహీనపడినట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు. 

అంతర్జాతీయంగా నష్టాల ముగింపే : 
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ఫ్యూచర్స్‌ ధర నష్టంతో ముగిసింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు  క్షీణించి 1,737.30డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్‌ ఇండెక్స్‌తో పాటు బాండ్‌ ఈల్స్‌ బలపడటం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గించాయి. అలాగే అమెరికా ఈక్విటీ మార్కెట్ల లాభాల ముగింపు కూడా పసిడి ఫ్యూచర్ల నష్టాలకు కారణమైంది. 

ఇక వారం మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు 3శాతం లాభపడ్డాయి. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఛైర్మన్‌ పావెల్‌ ఆర్థిక వృద్ది, రికవరిపై ఆందోళన వ్యక్తం చేయడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. అలాగే అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశ ప్రారంభం కావచ్చనే భయాలు పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. 

మరిన్ని వార్తలు