ఎంసీఎక్స్, స్పాట్ మార్కెట్‌లో పుత్తడి.. చిత్తడి!

27 Jun, 2013 03:03 IST|Sakshi
ఎంసీఎక్స్, స్పాట్ మార్కెట్‌లో పుత్తడి.. చిత్తడి!

న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్‌లో బంగారం ధర  భారీగా తగ్గుతోంది. బుధవారం కడపటి సమాచారం అందేసరికి నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 42 డాలర్లు తగ్గి (3.25 శాతం) 1,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ ధర దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయి 1,224 డాలర్లకు పడింది. ఇక వెండి కాంట్రాక్ట్ ధర 4.38 శాతం పడి 18.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2010 ఆగస్టు తరువాత వెండి ధర సైతం ఈ స్థాయిని చూడలేదు. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా ఇదే ధోరణిని అనుసరిస్తోంది. బంగారం 10 గ్రాముల ధర మంగళవారం ముగింపుతో పోల్చితే రూ.426 తగ్గి (1.6 శాతం) రూ.26,133 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి కేజీ ఏకంగా 2.85 శాతం నష్టంతో (రూ.1,158) రూ.39,505 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ చివరి వరకూ ఇదే ధోరణిలో కొనసాగితే గురువారం స్పాట్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పడే (డాలర్ మారకంలో రూపాయి కదలికలకు లోబడి) అవకాశం ఉంది.
 
 రూ.700 వరకూ డౌన్...
 

కాగా బుధవారం దేశీయంగా పలు బులియన్ స్పాట్ మార్కెట్లలో పసిడి ధర రూ.500 నుంచి రూ. 700 శ్రేణిలో పడింది. వెండి ధరలు సైతం రూ.1,000-రూ.1,700 శ్రేణిలో తగ్గాయి. ముంబైలో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.685 తగ్గి, రూ.26,280గా నమోదయ్యింది. 22 క్యారెట్ల ధర రూ.680 తగ్గి రూ. 26,145కు చేరింది. వెండి కేజీ ధర ఏకంగా ఒకేరోజు రూ. 1,695 తగ్గి రూ. 40,475కు పడిపోవడం గమనార్హం.    ఇక ఢిల్లీ విషయంలో ఈ ధరలు రూ.620 చొప్పున తగ్గి, వరుసగా రూ.26,680, రూ.26,480 వద్ద ముగిశాయి. వెండి ధర రూ.1000 నష్టపోయి రూ.40,500కు చేరింది. చెన్నైలో వెండి ధర ఏకంగా రూ. 40 వేల దిగువకు పడి, రూ.39,560కి చేరడం గమనార్హం.
 
 కారణం ఏంటి?
 అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న అంచనాల నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లలోకి మారడం పసిడి, వెండి వెలవెలకు కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాల నేపథ్యంలో ఆర్థిక సహాయక చర్యలను వచ్చే ఏడాది నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ ప్రకటించడం తెలిసిందే. మొత్తంమీద చూస్తే.. ఒకే త్రైమాసికంలో పసిడి ధర 23% పడింది. 1920 తరువాత కేవలం 3 నెలల్లో ఈ స్థాయిలో పసిడి పడిపోవడం ఇదే తొలిసారి. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పతనం అవుతున్నా, ఆ స్థాయి నష్టం మన దేశంలో కనబడ్డం లేదు. డాలర్‌తో  రూపాయి బలహీనత దీనికి ప్రధాన కారణం. 2011 సెప్టెంబర్‌లో నెమైక్స్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,921 డాలర్లకు చేరింది. 2013 ఏప్రిల్ నుంచి పూర్తిగా నష్టాల ట్రేడింగ్‌లోకి జారింది.  
 

మరిన్ని వార్తలు