ద్వితీయార్థంలో పసిడి

25 Aug, 2014 00:36 IST|Sakshi

న్యూఢిల్లీ: బలహీనమైన రుతుపవనాలు గ్రామీణ ప్రాంతాల్లో బంగారానికి డిమాండ్‌పై ప్రభావం చూపినప్పటికీ మొత్తమ్మీద మెరుగైన సెంటిమెంట్ కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థం(జూలై - డిసెంబరు)లో పసిడికి పూర్వవైభవం వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. ‘ఈ ఏడాది ప్రథమార్థంలో 80:20 ఫార్ములా (దిగుమతుల్లో 20 శాతాన్ని ఎగుమతి చేయాలనే నిబంధన) పుత్తడి డిమాండ్‌పై ప్రభావం చూపింది. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తారనీ, 10 గ్రాముల ధర మళ్లీ రూ.25 వేల స్థాయికి వస్తుందనీ ప్రజలు భావించారు.

ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల ప్రభావం కూడా డిమాండ్‌పై పడింది...’ అని డబ్యూజీసీ ఎండీ పి.ఆర్.సోమసుందరం చెప్పారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేల శ్రేణిలో ఉంది. గతేడాది ఏప్రిల్‌లో రూ.26,440గా ఉన్న ధర ఆగస్టులో రూ.34,600కు చేరింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయిపోయింది కాబట్టి దిగుమతి సుంకం తగ్గింపు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని సోమసుందరం తెలిపారు.

మరిన్ని వార్తలు