వడ్డీ తక్కువే... మరి చార్జీలో..!

4 Jul, 2016 00:39 IST|Sakshi
వడ్డీ తక్కువే... మరి చార్జీలో..!

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతామంటూ బ్రిటన్ నిర్ణయం తీసుకోవటం  స్టాక్ మార్కెట్లకు శరాఘాతమే. కరెన్సీలతో పాటు క్రూడ్ వంటి కమోడిటీలకూ గడ్డుకాలమే. కాకపోతే ఇలాంటి అనిశ్చితిలో అందరూ చక్కని ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించేది బంగారమే. ఈ నేపథ్యంలోనే దూసుకుపోతున్న పసిడి, ఈ ఏడాది చివరకు మరింతగా పెరగవచ్చనేది అంచనా.  ఆభరణాలుగా, పొదుపు సాధనంగా, ద్రవ్యోల్బణాన్ని కాచుకునే రక్షణ కవచంగా, అవసరమైతే రుణం రూపంలో ఆదుకునే మిత్రునిగా ఇలా బంగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

ఇక భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం మామూలుది కాదు. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో 10% భారతీయుల ఇళ్లలోనే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, పిల్లల చదువులు, సాగు కోసం పెట్టుబడి, ఇల్లు కొనుగోలు... అవసరం ఏదైనా వారికి ముందుగా కనిపించేది బంగారమే. కాకపోతే బంగారంపై రుణాల విషయంలో చాలామందికి అంతంతమాత్రం అవగాహనే ఉంది. ఈ విషయంలో తెలుసుకోవాల్సిన వాస్తవాలెన్నో ఉన్నాయి. అవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం..
 
గోల్డ్‌లోన్ తీసుకునే ముందు అవగాహన అవసరం
వడ్డీ రేటు తక్కువే కానీ... దానికి సవాలక్ష కండిషన్లు   
ప్రాసెసింగ్ నుంచి ఆలస్యానికి, ప్రీపేమెంట్‌కూ చార్జీలు
ఇవన్నీ కలిపితే పర్సనల్‌లోన్ కన్నా ఎక్కువే వడ్డీరేటు   
బంగారం విలువ తగ్గితే మరింత హామీ కావాలంటూ ఒత్తిళ్లు
ఇవన్నీ భరించేబదులు విక్రయించటమే బెటరంటున్న నిపుణులు

 
మన అవసరం... వారికి వ్యాపారం
బంగారం రుణాల్లో ఎక్కువ శాతం రూ.30  వేల నుంచి రూ.50వేల లోపు తీసుకునేవే ఎక్కువ. తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగా లభించే బంగారం రుణాలవైపు ఆకర్షితులవుతుంటారు. వాటిపై వడ్డీ, ఇతర చార్జీల రూపంలో పడే భారం గురించి వారికి తెలిసింది తక్కువే. పైగా, అత్యవసరాల్లో ఎక్కడా అప్పు దొరకని పరిస్థితుల్లోనే మరో మార్గం లేక బంగారాన్ని కుదువపెడుతుంటారు. దీంతో బంగారంపై రుణాలు ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు మంచి వ్యాపార వనరుగా మారింది. బంగారం రుణాల్లో 75 శాతం అవ్యవస్థీకృత రంగం (వ్యక్తులు సొంతంగా నడిపేది)లోనే ఉన్నాయి. మిగిలిన 25 శాతం మార్కెట్ వాటా ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకుల చేతిలో ఉంది.
 
బంగారంపై రుణం చిటికెలో పని!
మిగిలిన రుణాలతో పోలిస్తే బంగారంపై రుణం తేలిగ్గా లభిస్తుంది. వీధిలో ఉన్న వడ్డీ వ్యాపారి అయినా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ అయినా... విలువైన బంగారాన్ని కుదువపెడితే కళ్లకద్దుకుని రుణాలిచ్చేస్తారు. సామాన్యులను ఎక్కువగా ఆకర్షించే విషయమిదే. ఆదాయ వివరాలు, పే స్లిప్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. క్రెడిట్ స్కోర్‌తో పనిలేదు. కుదువపెట్టే నాటికి మార్కెట్లో ఉన్న బంగారం విలువలో 75 శాతం లేదా అంతకంటే తక్కువ రుణాన్ని మంజూరు చేస్తారు.

అయితే బంగారం ధర ఉన్నట్టుండి 25 శాతం వరకు పడిపోతేనే సమస్య ఎదురవుతుంది. కానీ, బంగారం ధరలు తక్కువ వ్యవధిలో ఇంత మేర పడిపోయిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువేనని చెప్పాలి. ఒకవేళ ఆ స్థాయిలో పడిపోతుంటే రుణదాత వెంటనే అప్రమత్తమై... వెంటనే రుణాన్ని కొంతమేర తీర్చివేయాలని లేదా మరికొంత మొత్తం బంగారాన్ని హామీగా సమర్పించాలని రుణగ్రహీతను కోరతారు.
 
చెప్పేది వేరు... చేసేది వేరు
చాలా వరకు ఎన్‌బీఎఫ్‌సీలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాలిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తుంటాయి. కానీ, రుణం కోసం వెళ్లినప్పుడే అసలు విషయం తెలుస్తుంది. బంగారాన్ని చూశాక గానీ రుణం ఎంతన్నది తేల్చవు. తాకట్టు పెట్టాలనుకునే బంగారం స్వచ్ఛత, విలువ పరీక్షించిన తర్వాతే ఎంత రుణం ఇచ్చేదీ చెబుతాయి. బంగారు ఆభరణాల విలువను లెక్కించడంలో అనుసరించే విధానం కూడా గోప్యమేనని స్వయంగా రిజర్వ్ బ్యాంకు బృందమే గుర్తించింది.

రుణ పత్రాలు, రుణాల జారీ విషయంలో పాటించే విధానం కూడా సంస్థను బట్టి మారుతుంటుంది. రుణగ్రహీతకు తాకట్టు పత్రం, రుణ ఒప్పంద పత్రాన్ని ఇస్తున్నాయి. కానీ, వాటిలో ఆభరణాల వివరాలు, ఎన్ని గ్రాములు, మదించిన విలువ వంటివి వేయటం లేదు. వార్షిక వడ్డీ రేటు వివరాలను కూడా పేర్కొనడం లేదు. రుణం కాల వ్యవధి ఎంత?  గడువులోపు చెల్లించడంలో విఫలమైతే వేలం విషయంలో అనుసరించే విధానమేంటి? ఇతర చార్జీలేమైనా ఉన్నాయా? ఇలాంటి వివరాలు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు జారీ చేసిన పత్రాల్లో ఉండటం లేదని ఆర్‌బీఐ బృందం తేల్చింది.

అలాగే, రుణగ్రహీత చెల్లింపుల విషయంలో విఫలమైతే హామీగా ఉంచిన బంగారు ఆభరణాలను వేలం వేసే ముందు ఆ విషయాన్ని కచ్చితంగా తెలియజేయాలి. కానీ, కంపెనీలు ఈ నిబంధనను పాటించ డం లేదు. రుణగ్రహీతకు చెప్పకుండా వేలం ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. వేలం వేసే రోజు మార్కెట్ విలువ ఎక్కువగా ఉండి... ఆ వేలం ద్వారా అధిక మొత్తం సమకూరితే రుణం, దానిపై వడ్డీ పోను మిగిలిన నగదును రుణ గ్రహీతకు తిరిగి చెల్లించడం లేదని కూడా ఆర్‌బీఐ గుర్తించింది.
 
వడ్డీ నెలనెలా... అసలు చివర్లో  
నెలనెలా వడ్డీ చెల్లిస్తూ గడువు తీరిన తర్వాత అసలు మొత్తాన్ని చెల్లించేసి తనఖా పెట్టిన బంగారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. బంగారంపై రుణాలిచ్చే బ్యాం కులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విధానాన్నే ఎక్కువగా పాటిస్తుంటాయి. వడ్డీతోపాటు అసలు కలిపి ఒకేసారి చెల్లించే అవకాశమూ ఉంది. రెండో ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం వడ్డీపై వడ్డీ జమకూడి చెల్లించాల్సిన మొత్తం బాగా పెరిగిపోతుంది.
- సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
వడ్డీ ఎంత...!?
ప్రకటనలను చూస్తే బంగారు రుణాలపై వడ్డీ చాలా తక్కువే అనిపిస్తుంది. కానీ, నిజానికి ఈ వడ్డీ ఎక్కువే. ఎందుకంటే వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీ, విలువ మదింపు చార్జీలు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపితే వడ్డీ ఎక్కువే అవుతుంది. పైగా నెలవారీ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే సంస్థలు విధించే జరిమానా భారీగా ఉంటుంది. రుణాన్ని ముందుగా తీర్చేసినా చార్జీలు తప్పవు.  మార్కెట్లో ఉన్న రెండు ప్రముఖ రుణ సంస్థల వడ్డీ రేటును పరిశీలిస్తే... 12 నుంచి 24 శాతం వరకూ ఉన్నట్టు వెల్లడయింది.

రుణం తీసుకునే కస్టమర్, తాకట్టు పెట్టే ఆభరణాలు, రుణ మొత్తం, వ్యవధిని బట్టి ఈ వడ్డీరేటు మారిపోతుంది. వాస్తవంలో గరిష్ట వడ్డీ ధర 24 శాతాన్ని దాటిపోయి 30% వరకూ ఉన్న సందర్భాలూ లేకపోలేదు. ఎన్‌బీఎఫ్‌ఎసీల మొత్తం బంగారం రుణాల్లో కేవలం 2 శాతమే 12% వడ్డీకి ఇస్తున్నవని వెల్లడయింది. మిగిలిన రుణాలపై వడ్డీ రేటు 24-26% మధ్యనే ఉంటోంది.
 
రుణం తీసుకోవాలా? బంగారం విక్రయించాలా?
ఒక గోల్డ్‌లోన్ సంస్థ ఇస్తున్న బంగారు రుణాలపై వడ్డీ నెలకు 2 శాతం. బంగారం మార్కెట్ విలువపై రుణం రేషియో (ఎల్‌టీవీ) కూడా 70 శాతం వరకే ఉంది. రుణం కాల వ్యవధి మూడు నెలలే. ప్రతి త్రైమాసికం చివర్లో వడ్డీ మొత్తం చెల్లిస్తే మరో మూడు నెలలకు రుణం పొడిగిస్తుంటారు. అసలు చెల్లించే వరకు ఇలా రుణం కాల వ్యవధి కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ బంగారం విలువ తగ్గి, ఎల్‌టీవీ రేషియో కూడా తగ్గితే అదనంగా బంగారాన్ని హామీగా ఉంచాలని సంస్థ నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి. చార్జీలన్నీ చెల్లించి, ఇలాంటి ఇబ్బందులు పడేకంటే కొన్నిసార్లు బంగారాన్ని విక్రయించడమే లాభసాటిగా కనిపిస్తుంది. అయితే, బంగారం ధరలు పెరిగేటపుడు ఈ ఆప్షన్ అంత మంచిదికాదు.
 
సెంటిమెంటుతో చిక్కు..
భారతీయులకు, ముఖ్యంగా స్త్రీలకు ఆభరణాలతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. తండ్రి తన పుట్టిన రోజున ప్రేమగా బహూకరించిన హారం, పెళ్లి నిశ్చితార్థం రోజున కాబోయే వరుడు చేతి వేలికి తొడిగిన ఉంగరం, పెళ్లి సందర్భంగా నాన్న చేయించిన బంగారు గాజులు, వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళి ఇలా ప్రతీ దానికీ ఓ చెరగని జ్ఞాపకం ఉంటుంది. అయితే, మంగళసూత్రం వంటి వాటిని మినహాయిస్తే మిగిలిన వాటి విషయంలో సెంటిమెంటును పక్కన పెడితేనే లాభమన్న విషయాన్ని తెలుసుకోవాలి. పైగా అమ్మడం వల్ల తర్వాత కావాలంటే కొత్త ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు. విక్రయించే ముందు వాటిని ఫొటో తీసి పెట్టుకుంటే అవే డిజైన్లతో ఆభరణాలను చేయించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
 
పసిడి... మెరుపు తగ్గదు!
న్యూయార్క్/ముంబై: స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నా... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి ధర తగ్గే పరిస్థితి లేదని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని వారి అంచనా. బ్రెగ్జిట్ నేపథ్యంలో మూడేళ్ల గరిష్ట స్థాయికి (జూన్ 23వ తేదీన ఔన్స్‌కు 1,355 డాలర్లు) ఎగసిన ధరలు మున్ముందూ ఇదే ధోరణిని కొనసాగిస్తాయన్నది వారి అంచనా. క్లుప్తంగా పరిశీలిస్తే...
     
* గోల్డ్ రిఫైనరీస్ జాతీయ సంఘం అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ రిఫైనరీస్ అండ్ మింట్స్ సెక్రటరీ జేమ్స్ ఈ అంశంపై మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ధర అంతర్జాతీయ ప్యూచర్స్ కమోడిటీ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 1,400 డాలర్లకు చేరడం ఖాయమని పేర్కొన్నారు.
* దేశీయంగా రూపాయి బలహీనత, పసిడి ధర భారీ పెరుగుదలకు కారణం అయ్యే అవకాశం ఉందని ట్రెజరీ అండ్ బ్యాంక్‌నోట్స్ సెంట్రల్ డెరైక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ హరిప్రసాద్ అంచనావేశారు.
* కనీసం ఆరు నెలలు, గరిష్టంగా 18 నెలలు పసిడి మెరుపు కొనసాగే అవకాశం ఉందని ఏవీపీ సిస్టమ్యాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ హెచ్ బీరేంద్రకుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. పసిడి 1,509 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడిన ఆయన, ఇదే జరిగితే కనిష్ట స్థాయి నుంచి 61.8 శాతం బలపడినట్లు (రిట్రేస్‌మెంట్) అవుతుందని, ఈ స్థాయిని దాటితే తిరిగి పసిడి తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరే అవకాశం ఉంటుందని అన్నారు.

వారంలో వెండి మెరుపులు: అంతర్జాతీయంగా ఔన్స్  25 డాలర్లు ఎగసి 1,344 డాలర్లకు చేరింది.  ముం బైలో శుక్రవారం శుక్రవారంతో ముగిసిన సమీక్ష వారంలో కొంత నెమ్మ దించింది. 99.9 స్వచ్ఛత ధర రూ.10 నష్టపోయి, 30.905 వద్ద ముగిసింది. అయి తే వెండి భారీగా కేజీకి రూ.2,150 ఎగసి రూ.45,080కి చేరింది.

మరిన్ని వార్తలు