క్యూ1లో వన్నె తగ్గిన బంగారం...

15 Aug, 2014 01:30 IST|Sakshi
క్యూ1లో వన్నె తగ్గిన బంగారం...

ముంబై: పసిడి రేటు మరింత తగ్గొచ్చన్న అంచనాల కారణంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బంగారానికి డిమాండ్ గణనీయంగా క్షీణించింది. 39% తగ్గి 204.1 టన్నులకు పరిమితమైంది. గతేడాది క్యూ2లో ఇది 337 టన్నులు. విలువ పరంగా చూస్తే పసిడికి డిమాండు రూ. 85,533.8 కోట్ల నుంచి రూ. 50,564.3 కోట్లకు పడిపోయింది.  

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బంగారం ధర రూ. 25,000కు తగ్గిపోవచ్చన్న అంచనాలు, సార్వత్రిక ఎన్నికల వల్ల ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు బంగారం డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. అయితే, గడచిన అయిదేళ్ల దీర్ఘకాలిక సగటును చూస్తే ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో సైతం పసిడికి బాగానే డిమాండ్ ఉందని భావించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఏడాది ప్రథమార్ధంలో బంగారం దిగుమతులు 43% క్షీణించి 351 టన్నులకు పరిమితమయ్యాయి. దిగుమతి సుంకాల పెంపు ఇందుకు కారణమని సోమసుందరం వివరించారు. గతేడాది ప్రథమార్ధంలో దిగుమతులు 620 టన్నులు.

 అంతర్జాతీయంగా డిమాండ్ 16% డౌన్..
 బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై  కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో సందిగ్ధం నెలకొనడంతో క్యూ2లో అంతర్జాతీయంగా కూడా పసిడికి డిమాండ్ తగ్గింది. 16 శాతం క్షీణించి 964 టన్నులుగా నమోదైంది. గతేడాది రెండో త్రైమాసికంలో ఇది 1,148 టన్నులు. విలువపరంగా చూస్తే 24 శాతం క్షీణించి 40 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 28 శాతం ఎగిసి 92 టన్నుల నుంచి 118 టన్నులకు పెరిగాయి.

ఇరాక్, ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభాలు, అమెరికా డాలరుకు ప్రత్యామ్నాయ సాధనాలవైపు సెంట్రల్ బ్యాంకులు దృష్టి సారిస్తుండటం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ ఎండీ మార్కస్ గ్రబ్ పేర్కొన్నారు. గతేడాది అసాధారణ పరిస్థితులు చూసిన మార్కెట్ ఇప్పుడిప్పుడే స్థిరపడుతోన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఇన్వెస్టర్లు ఎలక్ట్రానికల్లీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు మొగ్గు చూపడం రెండో త్రైమాసికంలో మరికాస్త పెరిగిందన్నారు.

 పెరిగిన పసిడి దిగుమతుల టారిఫ్ విలువ
 న్యూఢిల్లీ: బంగారం దిగుమతుల టారిఫ్ విలువను  ప్రభుత్వం పెంచింది. ఈ విలువ (10గ్రా) 421 డాలర్ల నుంచి 426 డాలర్లకు చేరింది. వెండిపై (కేజీ)కి 650కు పెంచింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఒక ప్రకటన చేసింది.  ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది.  విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువలో మార్పులు చేస్తారు.

>
మరిన్ని వార్తలు