4 నెలల పతనానికి బంగారం ధరలు

12 Dec, 2017 17:07 IST|Sakshi

న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజుల నుంచి బంగారం ధరలు కిందకి పడిపోతూ ఉన్నాయి. నేడు బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు నాలుగు నెలల కనిష్ట స్థాయిల్లో నమోదయ్యాయి. రూ.180 చొప్పున పడిపోయిన బంగారం ధరలు 10 గ్రాములకు రూ.29,400గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్‌, జువెల్లర్ల నుంచి తక్కువ డిమాండ్‌ నేపథ్యంలో బంగారం ధరలు మరింత కిందకి దిగజారుతున్నాయి. వెండి కూడా స్వల్పంగా రూ.25 తగ్గి, కేజీకి రూ.37,775గా నమోదైంది.

ఈ వారంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచవచ్చనే సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌ కొనసాగుతుందని, అంతేకాక స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ సరిగా లేదని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.54 శాతం తగ్గి, ఒక్కో ఔన్స్‌కు 1,241.40 డాలర్లు నమోదైంది. వెండి 0.95 శాతం తగ్గి, ఔన్స్‌కు 15.67 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.180 చొప్పున తగ్గి, రూ.29,400, రూ.29,250గా నమోదయ్యాయి. ఆగస్టు 5 తర్వాత ఇవే అత్యంత కనిష్ట స్థాయిలు. గత ఐదు రోజుల్లో బంగారం ధరలు రూ.670 కిందకి పడిపోయాయి.    
 

>
మరిన్ని వార్తలు