1,300 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం!

7 Jan, 2019 05:14 IST|Sakshi

ఆ స్థాయిని తాకి 14 డాలర్ల పతనం

అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 4వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కీలక నిరోధ స్థాయి 1,300 డాలర్లను తాకింది. ఆర్థిక అనిశ్చితి వార్తల నేపథ్యంలో  వారం మొత్తంలో నైమెక్స్‌లో పెరుగుతూ వచ్చిన పసిడి, ఆఖరిరోజు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆరు నెలల గరిష్టస్థాయి 1,300.35 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 21 డాలర్లు పతనమై, చివరకు కొంత కోలుకుని 1,286 డాలర్ల వద్ద ముగిసింది. దీనితో మొత్తంగా వారంలో పసిడి దాదాపు ఆరు డాలర్లు పెరిగినట్లయ్యింది.  1,300 డాలర్ల స్థాయిని తాకిన తర్వాత వెలువడిన అమెరికా డిసెంబర్‌ ఉపాధి అవకాశాల గణాంకాలు సానుకూలంగా ఉండడం, ఆర్థిక వ్యవస్థపై చిగురించిన ఆశలు పసిడి ఆరు నెలల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారడానికి కారణమని నిపుణుల విశ్లేషణ. ఇక టెక్నికల్‌గా చూస్తే, 1,300 కీలక నిరోధ స్థాయి కావడాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఈ వారం కీలక పరిణామాలు...
అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు (ప్రస్తుతం 2.25–2.5 శాతం శ్రేణి) తుది దశకు చేరుకుందనీ, రేటు పెంపు స్పీడ్‌ ఇకపై ఉండబోదని వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనతకూ దారితీస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో బుధవారం ఫెడ్‌ మినిట్స్‌ (డిసెంబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమావేశాల వివరాలు)  వెల్లడికానున్నాయి. ఆమరుసటి రోజు ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌  కీలక ప్రకటన వెలువడనుంది. శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడవుతాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి ఈ సందర్భంగా వెల్లడికానున్న అంశాల ఆధారంగా పసిడి ధర తదుపరి కదలికలు  ఉంటాయని విశ్లేషకులు  పేర్కొంటున్నారు.

దేశీయంగా రూపాయి కదలికలు ఆధారం...
ఇక దేశీయంగా పసిడి కదలికలు డాలర్‌ మారకంలో రూపాయి విలువ మార్పులకు అనుగుణంగా ఉంటుందని విశ్లేషణ.   అక్టోబర్‌ 9వ తేదీన       డాలర్‌ మారకంలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసిన రూపాయి ప్రస్తుతం 69పైకి (శుక్రవారం 69.72) కోలుకుంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగినా దేశీయంగా ఈ మెటల్‌ ధరల కట్టడికి దోహదపడింది. ముంబై మార్కెట్‌లో శుక్రవారం 24, 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ.32,840, రూ.31,280 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర       రూ. 42,600గా ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌–ఎంసీఎక్స్‌లో పసిడి ధర శుక్రవారం 31,456 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు