పసిడి..పరుగో పరుగు

17 Jun, 2016 00:20 IST|Sakshi
పసిడి..పరుగో పరుగు

అంతర్జాతీయ మార్కెట్‌లో దూకుడు
రెండేళ్ల గరిష్టానికి జూమ్, 1,300 డాలర్లపైకి
దేశీయంగానూ అదే ధోరణి...
4 రోజుల్లో 10గ్రా.లకు రూ. 1,100 అప్

న్యూయార్క్/ముంబై: పసిడి పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు డెలివరీ ధర ఔన్స్ (31.1గ్రా)కు కీలకమైన 1,300 డాలర్ల స్థాయిని దాటింది.ఇది రెండేళ్ల గరిష్టస్థాయి. కడపటి సమాచారం అందే సరికి క్రితం కన్నా దాదాపు 17 డాలర్లు అధికంగా 1,305 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.ఈ స్థాయిని దాటితే పసిడి మరింత బలపడుతుందన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఇక వెండి పరిస్థితి ఇదే ధోరణిగా ఉంది. దాదాపు ఒకశాతం లాభంతో 18 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఇదే బాటలో భారత్‌లోనూ పెరుగుతోంది.

సోమవారం నుంచి గడచిన నాలుగు రోజుల్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌లో దాదాపు రూ.1,100 పెరిగింది. వెండి కేజీ ధర సైతం రూ.1,200కుపైగా పెరిగింది. బుధవారంతో పోల్చితే గురువారం ధరలు 99.9 స్వచ్ఛత రూ.475 ఎగిసి రూ.30,400కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో ఎగిసి రూ.30,250కి చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.670 ఎగిసి రూ.42,340కి చేరింది. కాగా ఢిల్లీ, చెన్నై మార్కెట్లలో రూ.31,000 పైకి ఇప్పటికే పసిడి చేరడం గమనార్హం.

 ఫ్యూచర్స్ మార్కెట్‌లో పరుగు
దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల ధర 2 శాతం పైగా (రూ.650) లాభంతో రూ.31,092 వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 2 శాతం లాభంతో (రూ.700) రూ.42,235 వద్ద ట్రేడవుతోంది.

 కారణాలు ఏమిటి?
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును 0.50 శాతం నుంచి పైకి పెంచకుండా... తటపటాయిస్తుండడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనతలోనే ఉందన్న అంచనాలకు బలం చేకూరాయి. పైగా ఉపాధి కల్పన, డిమాండ్‌లకు సంబంధించి అమెరికా మే గణాంకాలు ప్రతికూలంగా ఉండడమూ ఆందోళన కలిగించింది. దీనితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని భద్రమైన మార్గంగా భావించడం మొదలుపెట్టారు. దీనికితోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే... భవిష్యత్ ఆర్థిక పరిస్థితి ఏమిటన్న అంశంపై సైతం ఆందోళనలు మొదలయ్యాయి. ఆయా అంశాలు అంతర్జాతీయంగా పసిడి దూసుకుపోడానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

డిస్కౌంట్‌లో బంగారం!
పుత్తడి రూ. 30,000 దాటినా ప్రపంచ మార్కెట్లో పలుకుతున్న ధరకంటే మన దేశంలో తక్కువకే దొరికేస్తోంది. ఇక్కడ పుత్తడికి వున్న మోజు కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే గతంలో మన నగరాల్లో అధిక ధర వుండేది. అలాంటిది, అనూహ్యంగా భారత్‌లో డిమాండ్ లేక బులియన్ ట్రేడర్లు ఇప్పుడు 2-3 శాతం చౌకగా అమ్మేస్తున్నారు. పైగా జూన్-జూలై నెలల్లో సాధారణంగా బంగారానికి గిరాకీ తక్కువ. దాంతో ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ ఔన్సు బంగారం (31.1 గ్రాములు) 48 డాలర్ల డిస్కౌంట్లో లభిస్తోంది.

 అక్కడ రూ. 31,000, ఇక్కడ రూ. 30,000
వివిధ అంతర్జాతీయ అంశాల కారణంగా న్యూయార్క్‌లో గురువారం పసిడి ధర ఔన్సుకు 1,310 డాలర్లు దాటింది. అంటే పది గ్రాముల ధర 421.2 డాలర్లు. ప్రస్తుత డాలరుతో రూపాయి మారకపు విలువ 67.30 ప్రకారం ఇది రూ. 28,350 అవుతుంది. దీనికి 10 శాతం దిగుమతి సుంకాన్ని కలుపుకుంటే ధర 31,180కి చేరుతుంది. ఇదే ట్రెండ్‌ను అనుసరించే ఇక్కడి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.31,000పైన ట్రేడవుతున్నా, ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల బంగారం ధర గురువారం రూ. 30,400కే లభించింది. హైదరాబాద్‌లోనైతే ఇది రూ. 30,000 మాత్రమే.

ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్‌కు అనుగుణంగా వివిధ నగరాల్లో రేట్లలో స్వల్ప తేడాలుంటాయి. ఈ ప్రకారం ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సాధారణంగా ధర ఎక్కువ వుంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ నగరంలో ఇంకా ఎక్కువ డిస్కౌంట్‌కే బులియన్ వర్తకులు బంగారాన్ని ఆఫర్ చేస్తున్నారు. పుత్తడి కొనుగోళ్లకు ఇది సీజన్‌కాకపోవడం, ధర అధికస్థాయిలో వుండటంతో కొనుగోలు ఆసక్తి సన్నగిల్లడం వ ంటి కారణాలతో డిమాండ్ లేదని వర్తకులు అంటున్నారు.

 పడిపోతున్న దిగుమతులు...
ప్రపంచంలోనే బంగారం వినియోగంలో టాప్‌లో వున్న భారత్‌కు గత నాలుగు నెలల నుంచి పుత్తడి దిగుమతులు పడిపోతున్నాయి. మే నెలలో దేశంలోకి దిగుమతుల పరిమాణం రీత్యా 51% క్షీణించి 31 టన్నులకు పడిపోగా, విలువరీత్యా 56 శాతం తగ్గుదలతో 1.47 బిలియన్ డాలర్లకు చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లోనైతే ఈ దిగుమతులు 22 టన్నులే. 2015 పూర్తి సంవత్సరంలో భారత్ 850 టన్నుల పసిడిని దిగుమతి చేసుకున్నదంటే (నెలకు సగటున 70 టన్నులు), ప్రస్తుత దిగుమతులు ఎంత క్షీణించాయో అర్థం చేసుకోవొచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా