పసిడి పరుగో పరుగు..

23 Aug, 2019 05:57 IST|Sakshi

ఢిల్లీలో 10గ్రా. ధర రూ.38,970

జీవితకాల గరిష్టస్థాయికి బంగారం ధర

న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజులుగా జీవితకాల గరిష్టస్థాయిలను తిరగరాస్తూ ర్యాలీ చేస్తోన్న పసిడి ధరలు తాజాగా మరో నూతన గరిష్టస్థాయిని నమోదుచేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్‌ గోల్డ్‌) బంగారం ధర రూ.38,970 వద్దకు చేరుకుంది. తాజాగా రూ. 39,000 ధరకు సమీపించింది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ క్రమంగా పెరుగుతున్న కారణంగా ఇక్కడి ధర ఒక్క రోజులోనే రూ.150 పెరిగి ఆల్‌ టైం రికార్డు హైకి చేరిందని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది.

డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం న్యూయార్క్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఒక దశలో 1,498.80 డాలర్లకు తగ్గింది. శుక్రవారం జాక్సన్‌ హోల్‌ ఎకనామిక్‌ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌  ప్రసంగం, జీ7 సమిట్‌ ఫలితాల వెల్లడి వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,500 డాలర్ల స్థాయిలోనే ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీ విభాగం హెడ్‌ హరీష్‌ అన్నారు. ఇక సావరిన్‌ గోల్డ్‌ ధర ఎనిమిది గ్రాములకు రూ.28,800 వద్ద ఉంది.

పసిడి బాటలోనే వెండి..
దేశ రాజధానిలో వెండి ధరలు గురువారం     çస్వల్ప పెరుగుదలను నమోదుచేశాయి. ఇండస్ట్రీ, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరిగిన కారణంగా స్పాట్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ.60 పెరిగి రూ.45,100 చేరుకోగా.. వీక్లీ డెలివరీ సిల్వర్‌ ధర రూ.113 పెరిగి రూ.43,765 వద్దకు చేరుకుంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.91,000 కాగా, అమ్మకం ధర రూ.92,000. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు ధర 17.09 డాలర్లకు ఎగబాకింది. 

మరిన్ని వార్తలు