మెరిసిన బంగారం.. 

25 Mar, 2020 04:24 IST|Sakshi

గరిష్టాలవైపు దూసుకెళ్లిన పసిడి

ఒకేరోజు 130 డాలర్లు అప్‌

ముంబై: కోవిడ్‌–19 ప్రభావ మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం– యల్లో మెటల్‌వైపు ఒక్కసారిగా దృష్టి సారించారు. దీనితో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1 గ్రాములు) మంగళవారం ఒకేరోజు ఏకంగా 130 డాలర్లు పెరిగింది. సోమవారం ఇక్కడ ధర ముగింపు 1568 డాలర్లు. మంగళవారం ట్రేడింగ్‌ ఒక దశలో 1,698 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయంలో కొంత లాభాల స్వీకరణకులోనై 1,660 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

101కి డాలర్‌ ఇండెక్స్‌... 
ఇదే సమయంలో ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 101.50కి పడిపోయింది. సోమవారం ముగింపు 103.24 కావడం గమనార్హం. అమెరికాలో కోవిడ్‌–19 మరణాలు పెరుగుతుండడం, ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీల బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర్లు డాలర్‌ల నుంచి కూడా పెట్టుబడులను వెనక్కు తీసుకుని తిరిగి పసిడిలోకి తరలించారని కొన్ని వర్గాల విశ్లేషణ. ఇదే పరిస్థితి కొనసాగితే, రెండు వారాల క్రితం చూసిన తన తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,704 డాలర్ల (52 వారాల గరిష్టం)ని మళ్లీ పసిడి అధిగమించి 1,800 డాలర్ల దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది.

రూపాయికి 26 పైసలు లాభం... 
అంతర్జాతీయంగా బలహీనపడిన డాలర్‌ ఇండెక్స్, ఈక్విటీల రిలీఫ్‌ ర్యాలీ వంటి అంశాల నేపథ్యంలో మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ నాలుగు ట్రేడింగ్‌ సెషన్ల వరుస చరిత్రాత్మక పతన స్థాయి నుంచి కొంత కోలుకుంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 26పైసలు కోలుకుని 75.94 వద్ద ముగిసింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది.  మంగళవారం ఒక దశలో 76.40ని కూడా రూపాయి చూసింది. ఇది ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం.

ప్రత్యామ్నాయం పసిడే: డబ్ల్యూజీసీ 
ప్రస్తుత తీవ్ర ఆర్థిక అనిశ్చితి, ఒడిదుడుకుల పరిస్థితుల్లో పెట్టుబడులకు ప్రత్నామ్నాయం బంగారమేనని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. పెట్టుబడుల పోర్టిఫోలియోను మెరుగ్గా ఉంచుకోడానికి పసిడి ఎంతో మెరుగైన సాధనమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్‌లు, బాండ్ల రిస్క్‌లకు అలాగే కరెన్సీ విలువలు పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలకూ పసిడి పటిష్ట ప్రత్యామ్నాయ పెట్టుబడిగా నిలుస్తుందని ‘వ్యూహాత్మక అసెట్‌గా పసిడి’ అన్న నివేదికలో డబ్ల్యూజీసీ విశ్లేషించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా