బంగారం మరింత మెరిసే అవకాశం

15 Jun, 2020 04:30 IST|Sakshi
కరోనా వైరస్, ‌ పసిడి, గరిష్ట రికార్డు, అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌

ఆర్థిక అనిశ్చితి ప్రధాన కారణం

1,800 డాలర్లు దాటితే వేగంగా మరింత ముందుకు!  

కరోనా వైరస్‌ నేపథ్యం... పెట్టుబడిదారులను పసిడివైపు పరుగులు తీసేలా చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మాంద్యంలోకి జారుకుంటున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఈక్విటీల్లో తీవ్ర ఆటుపోట్లు తత్సంబంధ పరిస్థితుల్లో పసిడి తిరిగి తన చరిత్రాత్మక గరిష్ట రికార్డు స్థాయి... ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా దూసుకుపోయే అవకాశాలే సుస్పష్టమవుతున్నాయి. కరోనా కట్టడి జర క్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే,  డిసెంబర్‌ నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో 1,900 డాలర్లకు చేరడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్నాయి.

2020లో ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు –5 శాతంపైగా క్షీణతలోకి జారిపోతుందన్న  అంచనాలు ఇక్కడ గమనార్హం.  అటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతోపాటు, ఇటు వర్థమాన దేశాల విషయంలోనూ ఆర్థిక వ్యవస్థలు క్షీణతనే నమోదుచేస్తాయని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం పావుశాతంగా ఉన్న అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ వడ్డీరేటు నెగెటివ్‌లోకి వెళితే, పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. 12వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో ఒక దశలో పసిడి 1,752 డాలర్ల స్థాయినీ చూడ్డం ఇక్కడ ముఖ్యాంశం.  

దేశంలోనూ రూ.50 వేలు దాటే అవకాశం
అంతర్జాతీయ ధోరణే కాకుండా, డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ధోరణి భారత్‌లో పసిడికి బలమవుతోంది. ఈ పరిస్థితుల్లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా నడిచే అవకాశాలే స్పష్టమవుతున్నాయి.  దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు శుక్రవారం రూ.47,334 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు