తగ్గిన బంగారం ధరలు

27 Jul, 2018 18:17 IST|Sakshi
బంగారం ధరలు ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ : వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. నేడు బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి రూ.30,740గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారానికి బలహీనమైన సంకేతాలు వీస్తుండటంతో బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి కూడా కేజీకి 230 రూపాయలు తగ్గింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో, కేజీ వెండి ధర 230 రూపాయలు తగ్గి, 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. 

యూరోపియన్‌ యూనియన్ల నుంచి వచ్చే కార్లపై టారిఫ్‌లను విధించకుండా ఉండేందుకు అమెరికా అంగీకరించడంతో, వాణిజ్య యుద్ధ భయాలు కాస్త సద్దుమణిగాయి. దీంతో డాలర్‌ బలపడుతోంది. డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో, విలువైన మెటల్‌ బంగారానికి డిమాండ్‌ పడిపోతుందని, దీంతో బంగారం ధరలు తగ్గుతున్నట్టు బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 190 చొప్పున తగ్గి, రూ.30,740గా, రూ.30,590గా నమోదైనట్టు పేర్కొన్నారు. అయితే గత రెండు రోజుల్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా 90 రూపాయలే పెరిగాయి.  

మరిన్ని వార్తలు