రూ.48వేల పైన ముగిసిన బంగారం

4 Jul, 2020 10:37 IST|Sakshi

వారం మొత్తం మీద రూ.259 పెరుగుదల 

ఆల్‌టైం హై స్థాయి నుంచి రూ.936 క్షీణత 

అంతర్జాతీయంగా స్వల్ప నష్టాల ముగింపే

దేశీయంగా బంగారం ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం రూ.48000 పైన ముగిసింది.  శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే 10గ్రాముల బంగారం ధర రూ.112లు నష్టపోయి రూ.48046 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 3నెలల గరిష్టంపైన స్థిరపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు గరిష్టస్థాయిల లాభాల స్వీకరణతో బంగారం ధర స్వల్ప నష్టాన్ని చవిచూసింది. 

ఇదే వారంలో బుధవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.48,982 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రికార్డు స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో రూ.936 క్షీణతను చవిచూసింది. వారం మొత్తం మీద రూ.259లు లాభపడింది. అలాగే ఈ ఏడాది ప్రథమార్థంలో బంగారం ధర 25శాతం ర్యాలీ చేసింది.  

అంతర్జాతీయంగా స్వల్ప నష్టాల ముగింపు: 
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర స్వల్ప నష్టంతో ముగిసింది. నిన్నటిరోజున బంగారం ధర 2.50డాలర్ల స్వల్ప నష్టంతో 1,787.60డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారంలో బంగారం ధర 1,801 డాలర్ల వద్ద 8ఏళ్ల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 కేసులు మరింత పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత ఆలస్యం కావచ్చనే అంచనాలు బంగారాన్ని రికార్డు స్థాయిల వైపు నడిపిస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు