పసిడిపై నోట్ల రద్దు ఎఫెక్ట్‌

4 Feb, 2017 01:24 IST|Sakshi
పసిడిపై నోట్ల రద్దు ఎఫెక్ట్‌

2016లో 21 శాతం తగ్గిన డిమాండ్‌
675.5 టన్నులకు క్షీణత
వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక
జ్యుయలర్ల సమ్మె, పాన్‌ కార్డ్‌ నిబంధనలు కారణం


ముంబై: పెద్ద నోట్ల రద్దు, జ్యుయలర్ల సమ్మెలు, భారీ స్థాయి కొనుగోళ్ల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి చేయడం తదితర అంశాలతో గతేడాది దేశీయంగా పసిడికి డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. 21 శాతం మేర క్షీణించి 675.5 టన్నులకు పడిపోయింది. 2015లో పుత్తడి డిమాండ్‌ 857.2 టన్నుల మేర నమోదైంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2016లో జ్యుయలరీ డిమాండ్‌ 22.4 శాతం క్షీణించి 662.3 టన్నుల నుంచి 514 టన్నులకు తగ్గింది. విలువపరంగా ఆభరణాల డిమాండ్‌ 12.3 శాతం తగ్గి రూ. 1,58,310 కోట్ల నుంచి రూ. 1,38,838 కోట్లకు క్షీణించింది.

’దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌ మొదలైన కారణాలతో నాలుగో త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ 3 శాతం వృద్ధితో 244 టన్నులకు పెరిగినప్పటికీ.. మొత్తం ఏడాదికి చూస్తే మాత్రం గణనీయంగా క్షీణించింది. కొనుగోళ్లకు పాన్‌ కార్డు తప్పనిసరి, జ్యుయలరీపై ఎక్సయిజ్‌ డ్యూటీ, డీమోనిటైజేషన్, ఆదాయ వెల్లడి పథకానికి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైన అంశాలతో పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొనడంతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడింది’ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్‌ తెలిపారు. అయితే, ఈ ధోరణి పుత్తడికి మాత్రమే పరిమితం కాకుండా మిగతా వ్యాపారాల్లో కూడా కనిపించిందని చెప్పారు. పెట్టుబడి అవసరాలకు సంబంధించి పుత్తడి డిమాండ్‌ 17 శాతం తగ్గి 194.9 టన్నుల నుంచి 161.5 టన్నులకు తగ్గింది.

ఈసారి 650–750 టన్నులు..
ప్రభుత్వ విధానాలు రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయగలవని, పసిడి పరిశ్రమలో పారదర్శకత పెరిగేందుకు దోహదపడగలవని.. ఫలితంగా కొనుగోలుదార్లకు చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రయోజనాలు చేకూరగలవని సోమసుందరం వివరించారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలు తదితర అంశాల ఊతంతో 2017లో పసిడి డిమాండ్‌ 650–750 టన్నుల శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేశారు.

అంతర్జాతీయంగా 2 శాతం వృద్ధి..
గతేడాది అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ 2 శాతం పెరిగి 4,309 టన్నులుగా నమోదైంది. అమెరికాలో బంగారం ఆధారిత ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లోకి పెట్టుబడుల వెల్లువ, నాలుగో త్రైమాసికంలో చైనాలో పసిడి కడ్డీలు.. నాణేలకు డిమాండ్‌ పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయని డబ్ల్యూజీసీ తెలిపింది. 2015లో డిమాండ్‌ 4,216 టన్నులుగా నమోదైంది. పెట్టుబడుల కోణంలో చైనాలో పుత్తడికి డిమాండ్‌ 70 శాతం పెరిగిందని.. నాలుగేళ్ల గరిష్ట స్థాయి 1,561 టన్నులకు చేరిందని డబ్ల్యూజీసీ తెలిపింది. మొత్తం మీద పెట్టుబడి అవసరాలకు సంబంధించి బంగారానికి డిమాండ్‌ పెరగడానికి .. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు (ముఖ్యంగా బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికలు) కారణమని వివరించింది. దేశాలవారీగా చూస్తే వినియోగం అత్యధికంగా ఉండే చైనా, భారత్‌లో 2016లో ఆభరణాల డిమాండ్‌ తగ్గినట్లు పేర్కొంది. అధిక ధరలు, సరఫరా పరిమితులు వంటి వాటి కారణంగా చైనాలో డిమాండ్‌ 7 శాతం తగ్గింది.

మరిన్ని వార్తలు