లాభాల స్వీకరణతో దిగివచ్చిన బంగారం

2 Jul, 2020 10:48 IST|Sakshi

జీవితకాల గరిష్టస్థాయి నుంచి రూ.820 వెనక్కి

రూ.48982 వద్ద కొత్త ఆల్‌టైం హై 

అంతర్జాతీయంగా 5డాలర్ల నష్టం 

రెం‍డురోజుల వరుస రికార్డు ర్యాలీ తర్వాత బంగారం ధరలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో జీవితకాల గరిష్టస్థాయి రూ.48982 నుంచి ఏకంగా రూ.820 దిగివచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో నేడు(గురువారం)కూడా స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర నిన్నటి ముగింపు పోలిస్తే రూ.82లు దిగివచ్చి రూ.48185 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారం ధర రూ. 48,000-48,700 శ్రేణిలో మరికొంత కాలం పాటు ట్రేడయ్యే అవకాశం ఉందని బులియన్‌ పండితులు చెబుతున్నారు. 

అంతర్జాతీయంగా బంగారం ధర 8ఏళ్ల గరిష్టాన్ని అందుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బంగారం ధర నిన్నటి రోజున రూ.220 లాభపడి రూ.48,982 వద్ద కొత్త జీవిత గరిష్టాన్ని నమోదు చేసింది. రికార్డు స్థాయి అందుకున్న అనంతరం బంగారం ధరల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి రూ.495 నష్టాన్ని చవిచూసి రూ.రూ.48,267 వద్ద స్థిరపడింది. (2రోజూ రికార్డు స్థాయికి బంగారం ధర)

అంతర్జాతీయంగా 5డాలర్ల నష్టం 

కరోనా కట్టడికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీలో పురోగతి వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగానూ బంగారం ధర దిగివచ్చింది. నేడు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర నిన్నటి ముగింపు (1,779డాలర్లు) తో పోలిస్తే 5డాలర్ల నష్టాన్ని చవిచూసి 1,775డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఫైజర్‌... జర్మనీ బయోటెక్‌తో కలిసి రూపొందించిన వ్యాక్సిన్‌ ట్రయిల్‌ దశలో కోవిడ్‌-19 వ్యాధిగ్రస్తులపై చెప్పుకొదగిన స్థాయిలో పని చేసిందని ప్రకటించింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా రెండు ప్రధాన సూచీలు లాభాల్లో ముగియగా, నేడు ఆసియాలో ప్రధాన దేశాలకు చెందిన సూచీలన్నీ లాభాల బాటపట్టాయి. ఈక్విటీ లాభాల ట్రేడింగ్‌ బంగారానికి డిమాండ్‌ను తగ్గించాయి. 

అయితే రానున్న రోజుల్లో బంగారం ర్యాలీ చేసే అవకాశం ఉన్నట్లు బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు. కోవిడ్‌-19 కేసులు రోజురోజూకు మరింత పెరుగుతున్నాయని, కొన్ని దేశాలు మరోసాని లాక్‌డౌన్‌ను విధించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరించింది. ఆ అంశం అమల్లోకి వస్తే బంగారం ధర తిరిగి లాభాల బాట పట్టడం ఖాయమని వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు