జీవితకాల గరిష్టం వద్ద బంగారం

24 Jun, 2020 10:57 IST|Sakshi

రూ.48,333 వద్ద కొత్త జీవితకాల గరిష్టస్థాయి

అంతర్జాతీయ మార్కెట్లోనూ 8ఏళ్ల గరిష్టానికి...

దేశీయ మార్కెట్లో బుధవారం బం‍గారం ధర రికార్డు గరిష్టస్థాయి స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఎంసీఎక్స్‌లో ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర రూ.68 లాభంతో రూ.48300 వద్ద కదులుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ఆర్థిక వ్యవస్థ రికవరికి మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ఆశలు బంగారం స్థిరమైన ట్రేడింగ్‌కు తోడ్పాటునిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం 8ఏళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  రూ.101 పెరిగి రూ.48,333 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర బంగారానికి కొత్త జీవితకాల రికార్డు స్థాయి కావడం విశేషం. నిన్నటి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల బంగారం ధర రూ.288లు లాభపడి రూ.48232 వద్ద స్థిరపడింది. మార్చి కనిష్టస్థాయి రూ.38,500 నుంచి నేటి కొత్త జీవితకాల గరిష్టస్థాయి వరకు లెక్కిస్తే ఈ 3నెలల్లో బంగారం 25శాతం పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో 8ఏళ్ల గరిష్టం వద్ద
అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర 8ఏళ్ల గరిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,791.55 వద్ద కదులుతోంది. కరోనా వైరస్‌ వ్యాధి రెండో దశ వ్యాప్తి భయాలు, అమెరికా చైనాల మధ్య తాజాగా వాణిజ్య ఉద్రిక్తతలు మొదలవడం, డాలర్‌ బలహీనత, ఆర్థిక మందగమన భయాలు బంగారం బలపడేందుకు కారణమవుతున్నాయిని బులియన్‌ పండితులు చెబుతున్నారు. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ విధింపుతో కుంటుపడ్డ ఆర్థిక ‍వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలు సెం‍ట్రల్‌ బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీలు, భారీగా వడ్డీరేట్లను తగ్గించాయి. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ఏకంగా 16శాతం లాభపడింది.
 

మరిన్ని వార్తలు