2రోజూ రికార్డు స్థాయికి బంగారం ధర

1 Jul, 2020 10:44 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో 8ఏళ్ల గరిష్టం వద్ద

వృద్ధి రికవరి ఆందోళనలతో బంగారానికి డిమాండ్‌

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో బంగారం ధర వరుసగా రెండోరోజూ కొత్త రికార్డుస్థాయిని అందుకుంది. నేటి ఉదయం 10గంటలకు 10గ్రాములు బంగారం ధర రూ.67ల పెరిగి రూ.48829 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర బంగారానికి సరికొత్త రికార్డు స్థాయి కావడం విశేషం. అంతర్జాతీయంగా బంగారం ధర 8ఏళ్ల గరిష్టాన్ని అందుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశీయంగా బంగారానికి డిమాండ్‌ పెరిగినట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.49050-49,230 స్థాయిలో కీలక నిరోధాన్ని ఎదుర్కోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. నిన్నటిరోజు ట్రేడింగ్‌లో రూ.48,825 వద్ద కొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. చివరికి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి రూ.518 లాభంతో రూ.48762 వద్ద స్థిరపడింది. 

అంతర్జాతీయంగా 8ఏళ్ల గరిష్టానికి: 
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 8ఏళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియాలో బంగారం ధర 1డాలరు స్వల్పలాభంతో 1,801 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ దేశాల్లో కోవిడ్‌ -19 రెండో దశ కేసుల ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రపంచ ఆర్థికవృద్ధి రికవరీ పట్ల ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ పెట్టుబడులకు బంగారంలోకి మళ్లిస్తున్నారు. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో బంగారం ధర 19.30డాలర్లు లాభంతో 1,800డాలర్ల వద్ద ముగిసింది. 

అమెరికాలో ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే రెండోదశ వ్యాధి వ్యాప్తిలో భాగంగా రోజుకు లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. అలాగే ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ నిన్నటి రోజు కాం‍గ్రెస్‌ ఎదుట మాట్లాడుతూ ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కరోనా వైరస్‌ను అదుపులోకి తీసుకురావడం అత్యవసరం.’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు